బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్న వేళ.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే.. దొంగలు చేతి వాటం చూపుతున్నారు. ఒంటి మీద ధరించిన నగలకే రక్షణ లేకుండా పోతుండగా.. ఇక తాళం వేసిన ఇళ్లలో దాచిన బంగారాన్ని వదులుతారా.. అస్సలు సమస్యే లేదు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున భారీ చోరీ వెలుగు చూసింది. అర కిలో బంగారం, కిలోన్నర వెండితో పాటు లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమేతంగా దేవుడి దర్శనానికి వెళ్లిన సమయాన్ని అనువుగా మార్చుకున్న గుర్తుతెలియని దుండగుడు ఇంటి తాళాలు పగలగొట్టి నిలువునా దోచుకున్నాడు. ఈ ఘటనలో సుమారు 48 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండితో పాటు రూ.3.5 లక్షల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు వేగవంతం చేశారు.
దేవుడి దర్శనానికి వెళ్లిన సమయంలో
ఉప్పల్ పరిధిలోని న్యూ భరత్‌నగర్ కాలనీలో గంగం భాస్కర్ రెడ్డి, బాలమణి దంపతులు నివాసముంటున్నారు. వీరు సోమవారం మధ్యాహ్నం తమ ఇంటికి తాళం వేసి కొమురవెల్లి దర్శనానికి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉందనే విషయాన్ని గమనించిన దొంగ, రాత్రి వేళ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ దోచుకెళ్లాడు.
పనిమనిషి రాకతో
మంగళవారం ఉదయం నిత్యం వచ్చే పనిమనిషి ఇంటికి రాగా, ప్రధాన తలుపులు తెరచి ఉండటం గమనించింది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా, వారు యజమాని భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు కొమురవెల్లి నుంచి హుటాహుటిన ఉప్పల్‌కు చేరుకున్నారు.
కోట్లలో సొత్తు మాయం..
బాధితులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలోని ఆభరణాలు, నగదు కనిపించలేదు.48 తులాల బంగారం, 1.5 కిలోల వెండి, రూ. 3.5 లక్షల నగదు దొంగిలించారని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఉప్పల్ పోలీసులు వేలిముద్రలు సేకరించారు.
ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్త
ఇంటికి తాళాలు వేసి దూర ప్రాంతాలకు లేదా దైవదర్శనాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని, అలాగే విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Also read
- GITAM University: యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
- హైదరాబాద్ : అర కేజీ బంగారం, 1.5 కిలోల వెండి చోరీ
- మారేడుపల్లి పోలీసుల చాకచక్యంతో భారీ చోరీ ఛేదన





