SGSTV NEWS online
Andhra PradeshTelangana

తుఫాన్ తీరం దాటడం అంటే ఏంటీ..? ఆ సమయంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..



తుఫాన్ వచ్చిన ప్రతీసారి మనం తీరం దాటడం అనే పదం వింటుంటాం. ప్రస్తుతం అర్నబ్ తుఫాన్ తీరం దాటడంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే అసలు తుపాను తీరం దాటడం అంటే ఏమిటి? ఆ సమయంలో ప్రకృతిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? తుపాను భూమి మీదకు వచ్చినప్పుడు వర్షం ఎందుకు తగ్గుతుంది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..



సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ఒక్కసారిగా భూమి మీదకు దూసుకొచ్చే ఒక గాలి ప్రవాహం మాత్రమే కాదు. ఇది వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించే శక్తివంతమైన వాతావరణ వ్యవస్థ. ఇందులో గాలులు వేగంగా తిరుగుతూ, భారీ మేఘాలు ఏర్పడి, విస్తృత ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. తుపాను సముద్రం నుంచి కదులుతూ తీర ప్రాంతానికి చేరుకున్నప్పుడు, దాని మధ్యభాగం తీరాన్ని దాటి భూమి మీదకు ప్రవేశించే ప్రక్రియను ల్యాండ్‌ఫాల్‌ లేదా తుఫాన్ తీరం దాటడం అంటారు. ఇది ఒక క్షణంలో జరిగిపోయే ఘటన కాదు. తుఫాను పరిమాణం, దాని కదలిక, తీర భౌగోళిక పరిస్థితులను బట్టి ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తుఫాను ముందుభాగం తీరాన్ని తాకినప్పుడే దాని ప్రభావం మొదలవుతుంది. కానీ వాతావరణ శాస్త్ర పరంగా తుఫాను కేంద్రం తీరాన్ని దాటి భూమి మీదకు చేరే దశను ల్యాండ్‌ఫాల్‌గా పరిగణిస్తారు.


అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది బొంగరం వంటిది!

నేలపై బొంగరాన్ని గిరగిరా తిప్పితే అది తన చుట్టూ తిరుగుతూనే ముందుకు కదులుతుంది. తుఫానులో కూడా గాలులు ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ, మొత్తం వ్యవస్థ ఒక దిశలో ప్రయాణిస్తుంది. అయితే తుపాను బొంగరం కంటే చాలా క్లిష్టమైన వాతావరణ వ్యవస్థ. సముద్రపు ఉపరితలం నుంచి లభించే వేడి, తేమ.. తుఫాను బలాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వెచ్చని సముద్రం నుంచి నీరు ఆవిరై పైకి వెళ్లి, మేఘాలుగా ఘనీభవించే సమయంలో విడుదలయ్యే వేడి తుఫాను వ్యవస్థకు శక్తిని అందిస్తుంది. అందువల్ల అనుకూల పరిస్థితుల్లో తుపాను మరింత బలపడుతుంది. అయితే తీరాన్ని దాటి భూమి మీదకు వచ్చిన తర్వాత సముద్రం నుంచి నిరంతరంగా లభించే తేమ తగ్గుతుంది. భూమిపై ఉండే చెట్లు, భవనాలు, కొండలు వంటి అడ్డంకుల వల్ల గాలి ప్రవాహం కూడా మారుతుంది. దీంతో తుఫాను సాధారణంగా క్రమంగా బలహీనపడుతుంది.



తుఫాన్ కన్ను ఆకారంలో ముందుకు కదులుతుంది?

తుఫాను మధ్యలో ఉండే ప్రశాంతమైన ప్రాంతాన్ని తుఫాను కన్ను అంటారు. దాని చుట్టూ అత్యంత ప్రమాదకరమైన మేఘాల వలయం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఐవాల్‌ అని పిలుస్తారు. సాధారణంగా తుపానులో అత్యంత తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఈ ఐవాల్‌ పరిధిలోనే నమోదవుతాయి. తుపాను తీరం దాటే సమయంలో మొదట దాని ముందుభాగం తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అనంతరం తుపాను కన్ను ఆ ప్రాంతానికి చేరుకుంటే కొంతసేపు గాలులు తగ్గవచ్చు. వర్షం కూడా తాత్కాలికంగా ఆగిపోవచ్చు. కానీ దీనిని తుఫాను పూర్తిగా వెళ్లిపోయిందని భావించకూడదు. కన్ను దాటిన తర్వాత దాని వెనుక భాగంలోని ఐవాల్‌, బలమైన గాలులు మళ్లీ ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయవచ్చు. గాలి దిశ కూడా మారవచ్చు. అందువల్ల తుపాను మధ్యలో ప్రశాంతత కనిపించినా బయటకు రావడం ప్రమాదకరం.


తుఫాన్ తీరం దాటడానికి ఎంత సమయం పడుతుంది?

తుఫాన్ తీరం దాటడానికి తప్పనిసరిగా మూడు లేదా నాలుగు గంటలే పడతాయని చెప్పలేం. ముందుకు కదిలే వేగం, తీరాన్ని ఏ కోణంలో చేరుతోంది అనే అంశాలపై సమయం ఆధారపడి ఉంటుంది. కొన్ని తుఫానుల ల్యాండ్‌ఫాల్‌ ప్రక్రియ కొన్ని గంటల్లో పూర్తవుతుండగా, మరికొన్నింటికి ఎక్కువ సమయం పట్టవచ్చు. తుపాను భూమి మీదకు వచ్చిన వెంటనే బలహీనపడిపోతుందని కూడా భావించకూడదు. అత్యంత వేగంగా వీచే గాలులు, భారీ వర్షాలు కొంతకాలం కొనసాగవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు, చెట్లు కూలడం, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం, రహదారులు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.

తుఫాను బలహీనపడినా ప్రమాదం పూర్తిగా లేనట్లు కాదు
సముద్రం నుంచి దూరంగా వెళ్లేకొద్దీ తేమ సరఫరా తగ్గడం, భూమిపై ఏర్పడే ఘర్షణ, భౌగోళిక అడ్డంకుల ప్రభావంతో తుపాను సాధారణంగా బలహీనపడుతుంది. అయినప్పటికీ దాని ప్రభావంతో అంతర్గత ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలులు సంభవించవచ్చు. అయితే తుఫాన్ కన్ను వచ్చినప్పుడు కనిపించే ప్రశాంతత తాత్కాలికం కావచ్చు. అధికారికంగా ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి. వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను పాటించాలి. తుఫాను తీరం దాటడం అంటే కేవలం సముద్రం నుంచి భూమి మీదకు రావడం మాత్రమే కాదు. అది ఒక భారీ వాతావరణ వ్యవస్థ తీర ప్రాంతాన్ని దాటే ప్రక్రియ. ఈ సమయంలో తుపాను కన్ను, దాని చుట్టూ ఉన్న బలమైన గాలుల వలయం, భారీ వర్షాలు ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Related posts