SGSTV NEWS online
Andhra PradeshCrime

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి.. పుడ్ పాయిజన్ అంటూ ప్రచారం.. కట్‌చేస్తే.


ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నా చెల్లెలు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రాహ్మణ కోడూరుకు చెందిన రాంబాబు, స్వర్ణ దంపతులకు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి సాత్విక్, నిత్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత 2022లో స్వర్ణ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత రాంబాబు అదే గ్రామానికి చెందిన మేరీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అనంతరం కుటుంబంతో కలిసి గుంటూరుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.


రాంబాబు తన పిల్లలను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చేర్పించగా సాత్విక్ ఐదో తరగతి, నిత్య మూడో తరగతి చదువుతున్నారు. అయితే మూడు రోజుల క్రితం రాంబాబు ఉన్నవలోని చెల్లెలి ఇంటికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా, దసరా తర్వాతి రోజు పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. ఇద్దరు చిన్నారులు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో కంగారుపడిన రాంబాబు వెంటనే పిల్లలను ఆసుపత్రికి తరలించారు.

దసరా ముందు రోజు పులిహోర తిన్నారని, మరుసటి రోజు చికెన్, బిర్యానీ తిన్నారని వైద్యులకు చెప్పారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భావించారు. అయితే శుక్రవారం రాత్రి చిన్నారుల పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే వారిని స్థానికంగా ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరు చిన్నారులకు జాండిస్ (కామెర్లు) వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు చికిత్స అందించినప్పటికీ, ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు.


చిన్నారుల మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ వారి మేనమామ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also read

Related posts