తెలుగు పంచాంగంలో ఏడో మాసమైన ఆశ్వయుజం దేవీ ఆరాధన, శరన్నవరాత్రులు, విజయదశమి వంటి పర్వదినాలకు ప్రసిద్ధి. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, కుటుంబ సంప్రదాయాలు కలగలిసిన ఈ మాసంలో పండుగల వెనుక ఉన్న విశిష్టతను తెలుసుకుందాం.
Aswayuja Masam Spiritual Traditions : తెలుగు మాసాల్లో ఏడో మాసం ఆశ్వయుజ మాసం. శక్తి ఆరాధనకు ఇది ప్రధానమైన మాసం. అందుకే ఈ ఆశ్వయుజ మాసం శక్తి మాసంగా పేరొందింది. దేవీనవరాత్రుల నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాల వరకు ఎన్నో విశేషాల సమాహారం ఈ ఆశ్వయుజం.
ఆశ్వయుజ మాసం విశిష్టత
ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి శరదృతువు ఆరంభం అవుతుంది. ఈ ఋతువులో చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా ఉండడం వల్ల వెన్నెల చల్లగా, ప్రకాశవంతంగా, తెల్లటి పూలలా వెలుగునిస్తుంది. ఆకాశంలో మేఘాలు దూది పింజల్లా కనిపిస్తాయి. ప్రకృతి మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. అందమైన, ఆహ్లాదకరమైన ఈ రుతువులో వచ్చే శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కతిలో ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఋతువులో వచ్చే ఆశ్వయుజ మాసం విశిష్టత గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
స్త్రీ పురుష రూపాత్మకం కాలం
తెలుగు పంచాంగం ప్రకారం, ఈ కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. ఒక ఏడాది ఆరంభంలో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం మాసాలు వచ్చే మొదటి ఆరు నెలల పురుష రూపాత్మకం అయితే ఏడాది ద్వితీయంలో ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం వచ్చే కాలం స్త్రీ రూపాత్మకంగా భావిస్తారు. ఈ భాగంలో తొలి నెల ఆశ్వయుజం! అందుకే ఈ మాసం అమ్మవారి ఉపాసనకు చాలా ప్రత్యేకం.
శక్తి మాసం
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం ఏడో మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు అశ్విని నక్షత్రంతో కలిసి ఉండడం వల్ల ఈ మాసానికి “ఆశ్వయుజ మాసం” అని పేరు వచ్చింది. శక్తి ఆరాధనకు ప్రధానమైన మాసం. అందుకే ఈ నెలను ‘శక్తి మాసం’ అని కూడా పిలుస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే మరిన్ని విశేషాలు చూద్దాం.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ మాసంలోనే అత్యంత వైభవంగా జరుగుతాయి.
శరన్నవరాత్రులు
ఆశ్వయుజ మాసం ప్రారంభంలో వచ్చే పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని, శక్తి స్వరూపిణిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఈ రోజు నుంచే తెలంగాణాలో బతుకమ్మ సంబరాలు కూడా మొదలవుతాయి. నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు చేసే సరస్వతి దేవి పూజతో విద్య, వాక్పటుత్వం, జ్ఞానసిద్ధి కలుగుతుందని విశ్వాసం. దేవి నవరాత్రులలో సువాసిని పూజ, కుమారి పూజ కూడా విశేషంగా చేస్తారు.
ఒకేరోజు మూడు విశేషాలు
దుర్గాష్టమి రోజు దుర్గాదేవి ఆరాధన, సద్దుల బతుకమ్మ పండుగ విశేషంగా చేస్తారు. ఈ రోజు దుర్గాదేవిని మహాదుర్గగా ఆరాధిస్తారు. ఇదే రోజు తులా సంక్రమణం కూడా కావడం విశేషం.
మహర్నవమి
నవరాత్రులలో తొమ్మిదో రోజు మహర్నవమి పర్వదినం ఈ రోజు దుర్గాదేవి మహిషాసుర మర్థినిగా దర్శనమిస్తుంది.
విజయదశమి
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి నాడు దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజు జమ్మి చెట్టును పూజించడం, శమీ వృక్షానికి ప్రదక్షిణ చేయడం, బంధుమిత్రులు ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. విద్యారంభానికి, నూతన కార్యాలు మొదలు పెట్టడానికి విజయదశమికి మించిన శుభదినం మరోటి ఉండదు. ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని విశ్వాసం.
అట్ల తద్ది:
వివాహితలు, యువతులు తమ సౌభాగ్యం కోసం, ఆరోగ్యం కోసం ఆశ్వయుజ మాసంలో ఆచరించే పరమ పవిత్రమైన నోము అట్ల తద్ది.
కోజాగిరి పౌర్ణమి (లక్ష్మీ పూజ)
ఆశ్వయుజ పౌర్ణమి నాడు క్షీరసాగర మథనంలో మహాలక్ష్మి ఉద్భవించిందని నమ్ముతారు. ఈ రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించి, ఆ చంద్రుని వెన్నెల వెలుగులో నైవేద్యం సమర్పిస్తారు.
దీపావళి
ఆశ్వయుజ మాస చివరి రోజైన అమావాస్య నాడు లోకమంతా చీకట్లను పారద్రోలుతూ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక ఇవి మాత్రమే కాకుండా ఏకాదశి పర్వదినాలు, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి, త్రయోదశి రోజు జరుపుకునే ధన త్రయోదశి, చతుర్దశి రోజు జరుపుకునే నరక చతుర్దశి, మాస శివరాత్రి విశిష్టమైన పర్వదినాలు. పవిత్రమైన ఆశ్వయుజ మాసంలో రానున్న పర్వదినాలు శాస్త్ర సమ్మతమైన విధానాల్లో ఆచరిద్దాం. సకల శుభాలు పొందుదాం.
