సంగారెడ్డి జిల్లా మానురు మండల కెద్రంలో విషాదం చోటుచేసుకుంది. మనూరు గ్రామ శివారులోని చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం సంభవించడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేపట్టారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనూరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38)లు ఒకే కుటుంబానికి చెందినవారు. శుక్రవారం (అక్టోబర్ 09) వీరంతా కలిసి గ్రామ శివారులోని చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. బట్టలు ఉతుకుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడే ప్రయత్నంలో మిగతా ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలోకి దిగి లోతు ఎక్కువ ఉండటంతో నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చెరువులోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డిలు అప్పటికే నీటిలో మునిగి శ్వాస ఆడక ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను స్థానికులు చెరువులో నుంచి బయటకు తీశారు. అయితే, తీవ్ర అస్వస్థతకు గురై నీటిలో కొట్టుమిట్టాడుతున్న కృష్ణవేణిని స్థానికులు కొనవూపిరితో రక్షించారు. ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె కూడా కన్నుమూశారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకేసారి మృత్యువాత పడటంతో మనూరు గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- దేవి నవరాత్రులు మొదలు దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!
- నవరాత్రుల్లో అదృష్టం.. ఈ రాశి వారు కోరుకున్న కోరిక నెరవేరుతుంది
- Garuda Purana: అప్పు తీర్చకుండా మరణిస్తే ఏమవుతుంది? గరుడ పురాణం ఏం చెబుతోంది?
- Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
- మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియకపోతే ఏం చేయాలి?





