బేస్తవారిపేట: తాను పూజలు చేసి డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25లక్షలు తీసుకుని ఓ మహిళను మరో మహిళ దారుణంగా హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం వీరభద్రాపురంలో జరిగింది. కంభం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం… వీరభద్రాపురానికి చెందిన గుమ్మా రాజమ్మ తాను డబ్బులు పెట్టి పూజలు చేస్తే రెట్టింపు అవుతాయని పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడుకు చెందిన ముడమంచు ఆదిలక్ష్మి(33)ని నమ్మించింది.
రాజమ్మకు ఆదిలక్ష్మి రూ.25 లక్షలు ఇచ్చి పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేయాలని కోరింది. అయితే, జూన్ 21 నుంచి ఆదిలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె భర్త బాలగురవయ్య పెద్దారవీడు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో గుమ్మా రాజమ్మను అనుమానితురాలిగా పోలీసులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గుమ్మా రాజమ్మ తన భర్త బుజ్జి గురవయ్యతో కలసి ఆదిలక్ష్మిని హత్య చేసి వీరభద్రాపురంలోని తమ పంటపొలంలో పూడ్చిపెట్టారని నిర్ధారించారు. ఆమె సెల్‌ఫోన్‌ను సమీపంలోని చెక్ డెం లో పడేశారని గుర్తించారు.
ఆదిలక్ష్మి మృతదేహాన్ని శనివారం పోలీసులు బయటకు తీసి తహశీల్దార్, జిల్లా ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. నిందితులు రాజమ్మ, బుజ్జి గురవయ్యను సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. నారాయణరెడ్డిపల్లెకు చెందిన రవిని కూడా రాజమ్మ ఇదే తరహాలో నమ్మించి రూ.45 లక్షలు తీసుకున్నారని చెప్పారు. దానిలో రూ.16లక్షల మేర ఆదిలక్ష్మికి ఇచ్చారని పేర్కొన్నారు.
Also read
- విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
- విజయవాడలో మహిళపై సామూహిక అత్యాచారం?
- రాఖీ పండుగకు వచ్చి.. నీటి కుంటలో జారిపడి అన్నదమ్ముల మృతి
- Telangana: ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు.. భద్రాచలం ఎమ్మెల్యే PAపై కేసు నమోదు!
- మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం వివాదం – ఓ నిండు ప్రాణం బలి




