సమీప బంధువే నిందితురాలు
మార్కాపురం జిల్లాలో వెలుగు చూసిన ఘోరం
అర్థవీడు : అధిక వడ్డీ వలలో చిక్కుకుని ఓ మహిళ దారుణహత్యకు గురైంది. సమీప బంధువైన మరో మహిళే ఈ ఘోరానికి ఒడిగట్టింది. మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో కుక్కేసి పంటపొలంలో పాతిపెట్టేసింది.
మార్కాపురం జిల్లాలో రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఉదంతం పోలీసుల దర్యాప్తుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన మూడమంచు ఆదిలక్ష్మి (32)కి… అర్థవీడు మండలం వీరభద్రాపురానికి చెందిన సమీప బంధువైన మహిళ అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపింది. రూ. లక్షకు రూ. లక్ష వస్తుందని నమ్మించింది. మొదట్లో ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇచ్చింది. నిజమేనని నమ్మిన ఆదిలక్ష్మి ఇంట్లో ఉన్న మొత్తంతో పాటు నగలన్నీ అమ్మేసి అంతా ఆమె చేతిలో పెట్టింది. భర్త వారించినా వినకుండా బయట అప్పులు చేసి రూ.50 లక్షల మేర ఇచ్చింది. తర్వాత సదరు మహిళ డబ్బులివ్వకుండా ముఖం చాటేసింది. ఆదిలక్ష్మి గట్టిగా నిలదీయడంతో హత్యకు ప్రణాళిక వేసింది.
డబ్బులు ఇస్తానని నమ్మించి ఈ ఏడాది జూన్‌లో ఇంటికి పిలిచింది. మత్తు కలిపిన పానీయం ఇచ్చి, ఆమె నిద్రలోకి జారుకున్నాక గొంతునులిమి చంపేసింది. మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి గ్రామంలోని ఎర్రకొండ సమీపంలోని పంటపొలంలో పాతిపెట్టింది. సెల్‌ఫోన్‌ను సమీప కుంటలోకి విసిరేసింది. ఆదిలక్ష్మి ఆచూకీ లేకపోవడంతో భర్త బాలగురవయ్య పెద్దారవీడు పోలీసులకు జూన్ 24న ఫిర్యాదుచేశారు. జులై 21న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెల్‌ఫోన్ సంకేతాలు వీరభద్రాపురంలో ఉన్నట్లు చూపడంతో బంధువైన మహిళతో పాటు స్థానికులను విచారించారు. తనకేమీ తెలియదని తొలుత ఆమె బుకాయించినా, పోలీసులు ఆమెను, కుమారుడినీ అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
నిందితురాలు చెప్పిన వివరాల ఆధారంగా మృతదేహం పాతిపెట్టిన ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గుంటూరు ఫోరెన్సిక్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చాక మృతదేహాన్ని వెలికితీయనున్నట్లు సమాచారం. నిందితురాలి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. మరో ఇద్దరు వ్యక్తులు సైతం ఈ మహిళ వలలో చిక్కుకుని రూ.60 లక్షల మేర ఇచ్చినట్లు తెలిసింది.
Also read
- Garuda Puranam: 13 రోజుల వరకు చనిపోయిన వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందా? అసలు విషయం ఇదే
- Shri Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస సమయాలివే
- నేటి జాతకములు..29 ఆగస్టు, 2026
- విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?
- ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి…





