కాకినాడ: ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య వేర్వేరుగా రాసిన సూసైడ్ నోట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ రెండింటిలోన రైఫిల్ షూటింగ్ కోచ్ సాధికాఖాన్ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొనడంతో అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
“ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ రెడ్డి గోదావరిలో దూకారు. రియాన్స్ ప్రాణాలతో బయటపడగా మిగిలిన ముగ్గురు మృతిచెందారు. రాజమహేంద్రవరంలో తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. నూకరాజు వద్ద, సౌజన్య స్కూటీలో రెండు సూసైడ్ నోట్లు దొరికాయి. మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు. ఆమె మామ భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పీఎస్‌లో కేసు నమోదు చేశాం. నిందితుడు సాధికాఖాన్ కోసం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 10 పోలీసు బృందాలతో ఐదు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాం. చివరికి యూపీలోని మేరర్లో అతడి ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశాం. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై కాకినాడ తీసుకొచ్చాం.
నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారై మేరఠ్ చేరుకున్న సాధిక్.. స్నేహితులకు మాయమాటలు చెప్పి ఆశ్రయం పొందాడు. ఫోన్, డబ్బు పోయినట్లు వారికి చెప్పాడు. అతడిపై వస్తోన్న మరికొన్ని ఆరోపణలపై విచారణ జరుగుతోంది. నిర్ధారణ అయ్యాక ఆ వివరాలు వెల్లడిస్తాం. హత్య, బలవంతపు మతమార్పిడి సెక్షన్ల కింద సాధిక్‌పై కేసులు నమోదు చేశాం. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తాం. కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతాం. కస్టడీలో ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. సామూహిక ఆత్మహత్య ఘటనకు ముందు బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు అండగా ఉంటారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు” అని ఎస్పీ కోరారు.
సాధికఖాన్కు 14 రోజుల రిమాండ్
సాధికాఖాన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కాకినాడ సబైజైలుకు సాధికాఖానన్ను తరలించారు. నిందితుడిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





