తెనాలిలో సోషల్ మీడియా పరిచయాలు ఓ వివాహితను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆర్థిక అవసరాల పేరుతో పరిచయస్తులు డబ్బులు తీసుకోవడం.. తిరిగి మరిన్ని డబ్బులు కావాలంటూ వేధింపులకు పాల్పడటంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలిలో నివాసం ఉండే లక్ష్మీ తిరుపతమ్మకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గృహిణిగా ఉంటున్న లక్ష్మీ తిరుపతమ్మకు మూడేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా బాజి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ తర్వాత నాగరాజు అనే మరో వ్యక్తితోనూ పరిచయం ఏర్పడింది. ఇద్దరితో ఆమె తరచూ చాటింగ్ చేసేది. ఈ పరిచయాల నేపథ్యంలో ఆర్థిక అవసరాల పేరుతో బాజి, నాగరాజులు ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం ప్రారంభించినట్లు తెనాలి రూరల్ పోలీసులు తెలిపారు. తొలుత ఆమె బంగారు ఆభరణాలను తీసుకుని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని, అనంతరం ఆమె వేసిన ప్రైవేట్ చిట్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా వారికి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇలా సుమారు రూ.40 లక్షల వరకు వారికి ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయినప్పటికీ మరిన్ని డబ్బులు కావాలంటూ వారు ఆమెను వేధించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆమె చెప్పినా వినకుండా బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో లక్ష్మీ తిరుపతమ్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ఇంటికి వచ్చేసరికి ఉరికి వేలాడుతూ..
ఉద్యోగం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త.. ఇంట్లో లక్ష్మీ తిరుపతమ్మ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల కారణంగా తాను ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలు, వారు తనను ఏ విధంగా వేధించారనే విషయాలను సూసైడ్ నోట్‌లో ఆమె వివరించినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు
మరోవైపు లక్ష్మీ తిరుపతమ్మ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ముఖ పరిచయం లేని వ్యక్తులతో సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత, ఆర్థిక వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





