అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తేల్చారు. నిద్రమాత్రలు ఇచ్చి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఇనుప రాడ్, రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
20 ఏళ్ల వైవాహిక బంధం.. రెండేళ్లుగా ప్రియుడితో సంబంధం
పీలేరు డిష్ కాలనీకి చెందిన మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం, ఉమాదేవి దంపతులకు దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉమాదేవికి చంద్రగిరి మండలానికి చెందిన 32 ఏళ్ల చారాల సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి.. ప్రియుడు సుబ్రహ్మణ్యంతో కలిసి వెంకట సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భోజనంలో నిద్రమాత్రలు
ఆగస్టు 7న రాత్రి సుమారు 8.30 గంటలకు ప్రియుడు ఇచ్చిన నిద్రమాత్రలను ఉమాదేవి ఇడ్లీ, సాంబార్, చట్నీలో కలిపి భర్తకు ఇచ్చింది. వాటిని తిన్న వెంకట సుబ్రహ్మణ్యం కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి వెళ్లాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ప్రియుడు చారాల సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించినట్లు పోలీసులు తెలిపారు.
ఇనుప రాడ్, రాయితో దాడి
గాఢ నిద్రలో ఉన్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఇద్దరూ కలిసి ఇనుప రాడ్, గుండ్రాయితో తలపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
హత్య విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 8 తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు మృతదేహాన్ని చారాల సుబ్రహ్మణ్యానికి చెందిన హోండా యాక్టివాపై తీసుకెళ్లి మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారిపై పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వెంకట సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు నమ్మించేలా నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, గుండ్రాయి, రక్తపు మరకలు ఉన్న బట్టలను గోనె సంచిలో కట్టి సమీపంలోని కుంటలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
మామ ఫిర్యాదుతో వెలుగులోకి..
మృతుడి తండ్రి మంగినేని క్రిష్టయ్య తన కుమారుడిది రోడ్డు ప్రమాదం కాదని, హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా కోడలు ఉమాదేవి ప్రవర్తనలో మార్పును గమనించిన ఆయన అనుమానమే నిజమైంది. క్రిష్టయ్య ఫిర్యాదు మేరకు పీలేరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీలేరు సీఐ జి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలను సేకరించి అన్ని కోణాల్లో విచారణ జరిపారు. దర్యాప్తులో ఉమాదేవి, చారాల సుబ్రహ్మణ్యం ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
భార్య, ప్రియుడు అరెస్ట్
ఆగస్టు 11 సాయంత్రం ఉమాదేవి (A-1), చారాల సుబ్రహ్మణ్యం (A-2)లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులను అభినందించిన ఎస్పీ
కేసును వేగంగా ఛేదించిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో పనిచేసిన పీలేరు సీఐ జి. వెంకటేశ్వర్లు, కలకడ సీఐ బి. లక్ష్మన్న, ఎస్‌ఐ రహీం, పోలీసు సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రత్యేకంగా అభినందించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు రివార్డులు అందజేశారు
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





