SGSTV NEWS online
Andhra PradeshCrime

నీట్ ఫలితాలు.. కుటుంబం ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి!



ఆంధ్రప్రదేశ్, కోడుమూరు : నీట్ పరీక్షలో మార్కులు  తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాలు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు.

బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965 మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487 మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాలు చెప్పసాగింది.

అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకు బయటకు రాకపోవడం, పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చిన వేణుగోపల్ భార్య భాగ్యమ్మ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే పుష్పావతి ఫ్యాను ఉరేసుకుని వేలాడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఉరి నుంచి తప్పించి చూడగా అప్పటికే మృతి చెందింది.

పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి నీట్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts