అమ్మా.. ఎంత పనిచేశావు?
తీవ్రగాయాలతో ఇద్దరూ మృతి.. తిరుపతి జిల్లా వెంకటగిరిలో కలకలం
తిరుపతి జిల్లా: బడి నుంచి ఇంటికొచ్చిన బిడ్డకు అన్నం పెట్టి
మళ్లీ పంపించాల్సిన తల్లి.. దారుణానికి పాల్పడింది. కొడుకుపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆ తల్లి తానూ పెట్రోల్ పోసుకుని సజీవదహనమైంది. అమ్మ తనకు ఎందుకు నిప్పంటించిందో తెలియక శరీరం కాలిపోతుంటే భరించలేక కేకలు వేస్తూ పరుగెత్తిన ఆ చిన్నారి తరువాత కన్నుమూశాడు. అమ్మ స్కూటీ ఎక్కమంటే.. ఎక్కడికో తీసుకెళుతుంది, ఏదో కొనిపెడుతుందన్న ఆశతో స్కూటీ ఎక్కిన ఆ చిన్నారి శరీరం కాలి విలవిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. హృదయవిదారకమైన ఈ ఘటన సోమవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో అందరికంట తడిపెట్టించింది.
పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన
నాగేశ్వరశర్మకు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన గూడలి శ్రావణి (35)కి 2014లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు చంద్రమౌళి (09) ఉన్నాడు. పట్టణంలోని కర్ణకమ్మ వీధిలో నివాసముంటున్నారు. నాగేశ్వరశర్మ కాశీపేటలోని శివాలయంలో అర్చకుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రమౌళి స్థానిక కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం బడికెళ్లి మధ్యాహ్నం ఇంటికొచ్చిన చంద్రమౌళిని తల్లి శ్రావణి స్కూటీపై ఎక్కించుకుంది. పట్టణానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లి రోడ్డుపక్కన ఆపింది. తన వెంటతెచ్చిన సీసాలో పెట్రోల్ కుమారుడిపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తనపైనా పోసుకుని నిప్పంటించుకుంది.
మంటలు, కాలిన గాయాలు తట్టుకోలేక ఆ బాలుడు కేకలు వేస్తూ పట్టణం వైపు పరుగులు తీస్తూ ఓ ఆటోడ్రైవర్ వద్దకు చేరుకున్నాడు. ఆటోడ్రైవర్ తన సెల్ఫోన్తో నాగేశ్వరశర్మకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకునేసరికే శ్రావణి పూర్తిగా కాలి ముద్దగా మారింది. తీవ్రంగా శరీరం కాలిన చంద్రమౌళిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న సీఐ రోశయ్య, ఎస్ఐ స్వరూప ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రావణి ఈ దారుణానికి పాల్పడటానికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Also read
- కుమారుడిపై పెట్రోల్ పోసి, తానూ నిప్పంటించుకున్న తల్లి
- దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీలు దేవాలయ ఔన్నత్యాన్ని పెంచే విధంగా పనిచేయాలి….
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?
- Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..
- మియాపూర్ భర్త మిస్సింగ్ డ్రామాలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చంపి, పాతేసింది భయ్యా!





