నిందితుడిపై గతంలో పోక్సో కేసు
బెయిల్ పై విడుదలై మళ్లీ ఘాతుకం
పెందుర్తి: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై ఓ యువకుడు హత్యాయత్నం చేసిన ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెందుర్తి సీఐ కె.వి.సతీశ్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన యువతి(19) రెండేళ్ల కిందట విశాఖ ఎన్ఏడీ కూడలి వద్ద ఓ కళాశాల వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదివింది. ఆ సమయంలో స్నేహితురాలి ద్వారా పెందుర్తి రైల్వేస్టేషన్ దరి గణేశ్‌నగర్‌కు చెందిన దల్లి సాయిచందు (22) పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ క్రమంలో సాయిచందు తరచూ పాయకరావుపేట వెళ్లి ఆమెను కలిసేవాడు. అనంతరం యువతితో చనువుగా ఉన్న వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ మేరకు యువతి తల్లిదండ్రులు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికి ఆమె మైనర్ కావడంతో పోలీసులు • పోక్సో కేసు నమోదు చేసి ఈ ఏడాది మార్చిలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు
ఈనెల 15న యువతి ఉద్యోగం కోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి విశాఖ వచ్చింది. విషయం తెలుసుకున్న సాయిచందు ఈనెల 17వ తేదీ రాత్రి ఆమెను ఎన్ఏడీ కూడలి వద్ద కలిశాడు. వారి మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన అతని తల్లి యమున కూడా అక్కడికి వచ్చారు. వారిద్దరిని గణేశనగర్లోని ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని యమున పాయకరావుపేట పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. 18వ తేదీ మధ్యాహ్నం ఉద్యోగం వెతుక్కోవడానికి రాజమహేంద్రవరం వెళ్లాలని యువతి నిర్ణయించుకుంది. ఆమె బయలుదేరే సమయంలో సాయిచందు అడ్డుపడి తనను పెళ్లి చేసుకోవాలని గొడవ చేశాడు. తనకు పెళ్లి కన్నా జీవితం ముఖ్యమని, ఉద్యోగం చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన సాయిచందు కత్తెర, చాకుతో ఆమె మెడపై దాడి చేశాడు. రక్తస్రావం కావడంతో సాయిచందు బంధువులు ఆమెను పెందుర్తి సీహెచ్‌సీకి తరలించారు అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. బాధితురాలు కోలుకోవడంతో పెందుర్తి పోలీసులు చినముషిడివాడలోని హోమ్‌లో ఉంచారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా కుమార్తెతో సంబంధం తెంచుకున్నామని వారు చెప్పినట్లు తెలిసింది. యువతి ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ నెల 15న ఆత్మహత్యాయత్నం: పోక్సో కేసులో అరెస్టయిన సాయిచందు గత నెలలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనపై అక్రమంగా కేసు పెట్టారన్న మనస్తాపంతో ఈనెల 15న గోపాలపట్నంలోని బంధువుల ఇంట్లో బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. శుక్రవారం యువతిపై దాడి చేసే సమయంలో ఇతనూ గాయపడి అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు కేజీహెచ్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. సాయిచందు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే అరెస్టు చేస్తామని సీఐ సతీశ్ కుమార్ తెలిపారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు





