SGSTV NEWS online
CrimeTelangana

పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్



Medak Baby Sale Case: ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో శిశు విక్రయ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళ తన రెండు నెలల మగ శిశువును దత్తత ఇచ్చినట్లు చెబుతుండగా, డబ్బుల కోసం అక్రమంగా విక్రయించారనే అనుమానాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశు విక్రయానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న మెదక్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన కలకలం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి (మం) ఉప్పు లింగాపూర్‌ గ్రామంలో రెండు నెలల మగ శిశువును విక్రయించినట్లు వస్తున్న ఆరోపణలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఎరుకలి మమత అనే మహిళకు రెండు నెలల క్రితం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు జన్మించాడు. అయితే, ఆ పసికందును కుటుంబ సభ్యుల సహకారంతో విక్రయించారనే వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.


మమత భర్త గతంలోనే మరణించాడు.. గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె పుట్టింటికి చేరింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల నడుమ ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన రెండు నెలలకే ఆ శిశువు ఇంట్లో లేకపోవడంతో స్థానికంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. బిడ్డను విక్రయించారనే ఆరోపణలు రావడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. విషయం తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ అధికారులు ఉప్పు లింగాపూర్ గ్రామానికి చేరుకొని, బాధిత మహిళతో పాటు కుటుంబ సభ్యులను సుదీర్ఘంగా విచారించారు.


పోలీసుల ప్రాథమిక విచారణలో మమత అసలు విషయాన్ని అంగీకరించింది. తనకు అంత స్తోమత లేకపోవడం వల్లే బిడ్డను దత్తత ఇచ్చానని ఆమె అధికారుల ముందు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కానీ, ఇది కేవలం దత్తత మాత్రమేనా? లేక దీని వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా కాకుండా, కొందరు వ్యక్తుల మధ్యవర్తిత్వంతో డబ్బుల కోసమే శిశువును విక్రయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ దత్తత వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు

Also read

Related posts