నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళతో పాటు ఆమె మనవడు, మనవరాలు సజీవ దహనమయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న వనం చంద్రకళ (45) తన ఇద్దరు మనవళ్లు లక్ష్మణ్ (16), ప్రణతి (14)లతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ముగ్గురూ బయటకు వచ్చే అవకాశం లేక చిక్కుకుపోయారు.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు మరింత ఉధృతమై ఇంటి మొత్తాన్ని ఆవరించాయి. ఈ ఘటనలో చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ నాగభూషణరావు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొన్నేళ్లుగా వెంటాడుతున్న విషాదాలు..
కాగా ఈ కుటుంబాన్ని గత కొన్నేళ్లుగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. చంద్రకళ భర్త సైదులు నెల రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమార్తె ధనమ్మ భర్త కూడా పదేళ్ల క్రితం మరణించడంతో ఆమె ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. జీవనోపాధి కోసం మూడు రోజుల క్రితం పుణెకు వెళ్లిన ధనమ్మకు ఈ విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Also read
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!
- హాట్సాఫ్ పోలీస్..! ప్రాణాలను పణంగా పెట్టి మహిళను కాపాడిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్!
- కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థిని సూసైడ్ నోట్.. అసలేం జరిగిందంటే..?





