సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామంలో ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను టార్గెట్ చేశాడు. అధిక వడ్డీ ఆశచూపి అందరి దగ్గరి నుంచి రూ.11 కోట్ల భారీ మొత్తాన్నివసూలు చేశాడు. తాజాగా డబ్బులు చెల్లించలేనని చేతులెత్తేశాడు.
Suryapet Scam : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామంలో ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను టార్గెట్ చేశాడు. తాను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే, మార్కెట్ రేటు కంటే చాలా ఎక్కువ మొత్తంలో అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. అంతేకాకుండా సకాలంలో అసలు, వడ్డీలను ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి చెల్లిస్తానని గట్టిగా హామీ ఇచ్చాడు. స్థానికంగా ఉండే వ్యాపారే కావడంతో అతని మాటలను నిజమని నమ్మిన శ్రీరంగాపురం గ్రామానికి చెందిన సుమారు 60 మంది రైతులు.. తాము కష్టపడి దాచుకున్న సొమ్మును, పంటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమ్మి అతని చేతిలో పెట్టారు. ఇలా అందరి దగ్గరి నుంచి కలిపి దాదాపు రూ.11 కోట్ల భారీ మొత్తాన్ని జితేంద్ర రెడ్డి వడ్డీకి వసూలు చేశాడు.
డబ్బులు తీసుకున్న మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత అసలు రంగు బయటపడింది. చాలా కాలంగా రైతులకు వడ్డీలు చెల్లించడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన రైతులు తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఈ క్రమంలో రైతులకు అండగా నిలవాల్సిన సదరు వ్యాపారి, ముందస్తు ప్లాన్‌తో అన్నదాతలకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఏడాది వరకు ఎవరికీ పైసా కూడా తిరిగి ఇవ్వలేనంటూ ఏకంగా కోర్టు నుంచి రైతులకు లీగల్ నోటీసులు పంపించాడు. కోర్టు నోటీసులు చూసిన రైతులు.. తాము దారుణంగా మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు.
న్యాయంగా రావలసిన తమ సొమ్మును ఇవ్వకుండా కోర్టు నోటీసులతో బెదిరించాలని చూడటంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులంతా ఏకమై కోదాడలోని సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిని ముట్టడించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ జితేంద్ర రెడ్డి ఇంటి ముందే టెంట్లు వేసి, బైఠాయించి ఆందోళనకు దిగారు. కష్టపడి సంపాదించిన డబ్బులు పోవడంతో మహిళా రైతులు, వృద్ధులు కన్నీరుమున్నీరవుతూ ధర్నాలో కూర్చున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ సొమ్మును వెంటనే తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
బాధిత రైతులు ఇళ్ల ముందే బైఠాయించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు రావాల్సిన రూ.11 కోట్ల అప్పును పూర్తిగా చెల్లించే వరకు ఈ ధర్నాను విరమించే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. నమ్మి డబ్బులు ఇస్తే కోర్టు నోటీసులతో ముంచేయడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు తమకు దక్కేలా చూడాలని కోరుతున్నారు.
Also read
- ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు
- అధిక వడ్డీ ఆశ చూపి రూ.11 కోట్లకు కుచ్చుటోపి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిని ముట్టడించిన రైతులు!
- భక్తి ముసుగులో IIT కామాంధుడు….ప్రవచనాలు చెబుతూ అమ్మాయిలతో రాసలీలాలు!
- ఆసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. అధికారుల తనిఖీలో బయటపడ్డ సంచలనాలు!
- అప్పుల బాధతో కన్న పిల్లలకు విష గుళికలు ఇచ్చి..





