తల్లి, కుమార్తెను హతమార్చిన దుండగులు
మూడు రోజుల తర్వాత వెలుగులోకి హత్యోదంతం
ఏలూరు జిల్లా నల్లమాడు ఆయకట్టు వద్ద సంచలనం
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు
ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో మూడు రోజులు క్రితం జరిగిన జంట హత్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మృతులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీ కుమార్తెగా గుర్తించారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… అనంతపల్లికి చెందిన గంటా అంథోబాయికి నలుగురు పిల్లలు. వీరిలో వెంకటలక్ష్మి అంధురాలు కావడంతో 2009లో బ్యాక్లాగ్ పోస్టులో ఏలూరు మున్సిపాలిటీలో అటెండర్ ఉద్యోగం వచ్చింది.
తల్లి అంథోబాయితో కలిసి ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తోంది. వెంకటలక్ష్మి సోదరుడు సుదర్శన్ కూడా వీరితోనే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరులో తల్లీకుమార్తె బయలుదేరి ఫంక్షన్కు వెళ్లేందుకు దూబచర్ల వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో దూబచర్ల చేరినట్టు ఏలూరులో ఉన్న కుమారుడికి తల్లి ఫోన్ చేసి చెప్పింది. 9 గంటల నుంచి వారి ఫోన్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆలపాటి వేణు అనే రైతు పొలంలోకి వెళ్లగా అక్కడ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు.
దీంతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుకుని వివరాలు సేకరించారు. జంట హత్యల విషయం తెలియడంతో నల్లజర్ల, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతులను గుర్తించి అనంతపల్లికి చెందిన వారని చెప్పడంతో వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో హంతకుల కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి బస్సు దిగిన తర్వాత తల్లీకుమార్తె ఆటో ఎక్కి ఉండవచ్చని… ఆటో డ్రైవర్ వీరిని నల్లమాడు ఆయకట్టు పరిధిలోని జీడితోటలోకి తీసుకెళ్లి బంగారం, నగదు కోసం హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకులు ఎవరు, హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





