SGSTV NEWS online
Andhra Pradesh

మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు.. పవన్‌ ఘాటు కామెంట్స్



జనసేన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమిత్ షాతో జరిగిన భేటీపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన పవన్.. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ సమావేశం జరిగిందన్నారు. పార్టీపై, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. “మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు” అని హెచ్చరించారు



జనసేన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి ప్రత్యర్థుల ప్రచారం వరకు పలు అంశాలపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా తనపై, పార్టీపై జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ‘మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు’ అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.


అమిత్ షాతో జరిగిన భేటీపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన పవన్ కల్యాణ్.. కేంద్ర హోంమంత్రితో జరిగిన చర్చల విషయాలు బయటివాళ్లకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జైలుకెళ్లాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని స్పష్టం చేశారు. ‘ఒక నాయకుడు జైలుకెళ్తే జనసేన ఎదుగుతుందా?’ అంటూ ప్రశ్నించిన ఆయన.. అలాంటి ప్రచారాలు వ్యవస్థను అవమానపరచడమేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిశానని వెల్లడించారు.

ఇక పార్టీ అంతర్గత పరిస్థితులపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శత్రువులు బయట లేరు.. మన పార్టీలోనే ఉన్నారు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పదేపదే పరీక్షించే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరిస్తూ.. ఇప్పటి వరకు చాలా భరించానని, ఇక భరించే ఓపిక లేదన్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకోనని స్పష్టం చేశారు.


జనసేనపై విమర్శలు చేసే వారిపై కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దారిన పోయేవాళ్లు కూడా జనసేనపై రాళ్లు వేస్తామంటే చూస్తూ ఊరుకోను’ అంటూ ఘాటుగా స్పందించారు. తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, అసత్య ప్రచారాలతో భయపెట్టాలని చూస్తే కుదరదన్నారు. అవసరమైతే రాజకీయ యుద్ధానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. కుల రాజకీయాల అంశంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. తాను ఎప్పుడైనా “కుల నాయకుడిని” అని చెప్పానా అని ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టే రాజకీయాలు సమాజానికి మంచివి కావన్నారు. తనను పదేపదే కుల రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమిళనాడు రాజకీయాలపై కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయాలు ఎంతో సాఫీగా సాగాయని, తనకు అసూయ కలిగేంతగా వ్యవస్థ పనిచేసిందన్నారు. ‘అక్కడ నటుడు కటౌట్లు పెట్టుకుంటే సీఎం అయ్యారు.. కానీ నేను ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు పట్టింది’ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పవన్.. జనసేనను తనకు నచ్చిన విధంగా ముందుకు తీసుకెళ్తానన్నారు. పార్టీలో ఉండగలిగినవాళ్లే ఉండాలని, క్రమశిక్షణ పాటించాల్సిందేనని హెచ్చరించారు. నాయకత్వాన్ని ప్రశ్నించడం కంటే పార్టీ ఆదేశాలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.

మొత్తంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయ ఒత్తిళ్లు, తనపై జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో జనసేన భవిష్యత్తుపై మరింత దూకుడుగా ముందుకెళ్లే సంకేతాలు కూడా ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also read

Related posts