SGSTV NEWS online
CrimeTelangana

Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!






అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు మండలం ఎల్లక్కపేటకు చెందిన చల్ల రమేష్ కు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజీవ్ నగర్ ( అడ్డగుంటపల్లి )కి చెందిన శారద(27)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు తేవాలని శారదను భర్త రమేష్ తో పాటు అత్తామామలు వెంకమ్మ-అబ్బయ్య, ఆడపడుచు పుష్పలత కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు. గతేడాది గోదావరిఖనిలో కులపెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.


అయిన రమేష్ కుటుంబం ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచూ పెద్దలతో పంచాయితీ పెట్టిస్తోందనే కారణంతో శారదను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించారు. సోమవారం మధ్యాహ్నం దగ్గరి బంధువైన గంధం సారయ్య తో కలిసి భార్య శారదను రమేష్ సుత్తితో అతికిరాతకంగా దాడి చేసి చంపేశాడు. మూడు నెలల చంటి పిల్ల తల్లి అని కూడా చూడకుండా శారదను అత్యంత కిరాతకంగా మట్టు పెట్టాడు భర్త రమేష్. శారద చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత చెన్నూర్ పోలీస్ స్టేషన్ లో బంధువు సారయ్యతో కలిసి లొంగిపోయాడు.

విషయం తెలుసుకున్న మృతురాలు శారద కుటుంబ సభ్యులు రమేష్ పోలీసుల అదుపులో ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆవేశంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రమేష్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషబ్ లోనికి దూసుకెళ్లి రమేష్ పై రాళ్లతో దాడికి యత్నించారు. ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ అడ్డుకోవడంతో వారి పై సైతం దాడికి దిగారు శారద తరుపు బంధువులు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంపత్ తో పాటు ఏఎస్సై మాజీద్ కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తల్లి మృతి, తండ్రి జైలు పాలవడంతో రెండేళ్ల బాబు, మూడు నెలల పాప అనాథలుగా మారారు.

Also read

Related posts