SGSTV NEWS online
CrimeTelangana

అయ్యో తాత.. మనవడిని బతికించి ప్రాణాలు వదిలేశాడు.. అసలేం జరిగిందంటే..?



ప్రాణం పోయినా పర్వాలేదు.. నా కళ్లముందే పుట్టిన మనవడు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు ఆ తాత. బోరు బావిలో పడిపోయిన పిల్లాడిని కాపాడటం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. మనవడిని మృత్యువు నుంచి క్షేమంగా వెనక్కి తీసుకొచ్చి.. తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.


నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గిర్ పల్లికి చెందిన వెంకన్నకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు ఏడేళ్ల లోహిత, నాలుగేళ్ల అభిలాష్ ఉన్నారు. వేసవి సెలవుల్లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చింది. అయితే వెంకన్న.. కూతురు పిల్లలు లోహిత, అభిలాష్ లను తీసుకుని ఉట్లపల్లిలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. తాను పొలం పనుల్లో ఉండగా, మనవడు నాలుగేళ్ల అభిలాష్ ఆడుకుంటూ నిరుపయోగంగా ఉన్న బోరు బావి గుంతలో పడిపోయాడు. దీనిని గమనించిన అక్క లోహిత.. తమ్ముడు గుంతలో పడిపోయిన విషయాన్ని తాతకు చెప్పింది. ఎలాగైనా మనవడిని కాపాడాలనే ఆరాటంతో గుంతలోకి చేయి వేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో వెంకన్న కూడా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు. దీంతో మనవరాలు లోహిత కేకలు వేయడంతో సమీపాన ఉన్న యువకులు, మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు రెస్క్యూ చేసి తాత, మనవడిని.. బయటకు తీశారు. బాలుడు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయట పడగా, వెంకన్న మాత్రం సుమారు గంటకు పైగా లోపల ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మనవడి ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన తాత వెంకన్న ఉదంతం గ్రామస్తులను కలచి వేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉపయోగంలో లేని బోరు బావులను పూడ్చి వేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయనీ పోలీసులు చెప్పారు.

Also read

Related posts