ఓ రైతు లోన్ తీసుకునేందుకు షూరిటీగా సంతకం పెట్టినందుకు తోటి రైతులకు బ్యాంక్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. సదురు రైతు తీసుకున్న లోన్ కట్టకపోవడంతో షూరిటీగా సంతంకం పెట్టిన రైతు ఖాతాలో జమైన రైతు భరోసా, పెన్షన్ డబ్బులను బ్యాంక్ అధికారులు ప్రీజ్ చేశారు. దీంతో బ్యాంక్ అధికారులు తమ నోటికాడి కూటిని లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం, నిరుపేదలకు అండగా ఉండే పింఛన్ డబ్బులను సైతం బ్యాంక్ అధికారులు ఫ్రీజ్ చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని చౌటకూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు అనే రైతు తోటి రైతు హట్యా రాములు పంట రుణం కోసం గతంలో షూరిటీ సంతకం పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హట్యా రాములుకు రుణమాఫీ కాలేదు. దీంతో అతను తీసుకున్న రుణం ఇంకా చెల్లించలేదు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.
ఇటీవల బేగరి రాములు ఖాతాలో ప్రభుత్వం రైతుభరోసా కింద 6 వేల రూపాయలు, ఆసరా పింఛన్ కింద మరో 2 వేల రూపాయలు జమ చేసింది. ఈ ఎనిమిది వేల రూపాయలను విత్ డ్రా చేసుకునేందుకు మంగళవారం బ్యాంకుకు వెళ్లిన రాములుకు మేనేజర్ మాధవరెడ్డి షాకిచ్చారు. నువ్వు హట్యా రాములుకు షూరిటీ ఉన్నావు.. అతను అప్పు కట్టడం లేదు కాబట్టి, నీ డబ్బులు అతని అప్పు కింద జమ చేసుకుంటున్నాం అని తేల్చి చెప్పారు. దీంతో బ్యాంక్ అధికారులు నోటికాడి కూడును లాక్కుంటున్నారంటూ రాములు కన్నీటిపర్యంతమయ్యాడు.
సమాచారం అందుకున్న బొమ్మారెడ్డిగూడెం తండా సర్పంచ్ బ్యాంకుకు చేరుకుని మేనేజర్ ను నిలదీశారు. ఒక్క రాములే కాదు, బద్రిగూడేనికి చెందిన గంగయ్య అనే మరో రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ధాన్యం అమ్మిన డబ్బులను సైతం బ్యాంకు సిబ్బంది ఫ్రీజ్ చేయడంతో రైతులు రోడ్డెక్కారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పాండు ఎల్డీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే సొమ్మును రికవరీ కింద జమ చేసుకోవద్దని ఆర్బీఐ నిబంధనలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో బ్యాంక్ అధికారులు మాత్రం తమ రూటే వేరంటున్నారు. మరి ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.
Also read
- దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఆ ఇంట
- రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్ చెక్ చేయగా..
- అర్జెంట్‌గా డబ్బు అవసరమని ఫోన్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి.. కొన్న కాసేపటికే
- కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!
- నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ





