తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా కొందరు కేటుగాళ్లు నకిలీ వస్తువులతో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అనుప్ అగర్వాల్, ఏపీ రాజమండ్రికి చెందిన ఏడిద సతీష్ లకు.. హైద్రాబాద్ లో పరిచయం ఏర్పడింది. ఏ వ్యాపారం చేసినా వీరికి ఆశించిన స్థాయిలో ఆదాయం లేదు. దీంతో ఈజీ మనీ కోసం ఇద్దరూ కంత్రీగాళ్ళు పథకం వేశారు. ఇదే సమయంలో రాజమండ్రికి చెందిన పావులూరి నారాయణ మూర్తి.. సతీష్ బంధువుల వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. దీంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనుప్ అగర్వాల్, సతీష్ లు సిగరెట్లు, సబ్బులు, కొబ్బరి నూనె, టీ పొడి, బ్రూ కాఫీ వంటి నకిలీ వస్తువులను ఢిల్లీ నుండి పార్సిల్ ద్వారా హైదరాబాద్ తెప్పించారు. ఈ నకిలీ వస్తువులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయించే బాధ్యత సతీష్ ది. ఇలా కొన్ని నెలలుగా దందా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నాలుగు నెలల క్రితం నారాయణ మూర్తి.. కోదాడలోని వెంకటేశ్వర నగర్ లో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. హైద్రాబాద్ నుండి నకిలీ వస్తువులను కోదాడలో డంప్ చేసి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా విక్రయిస్తున్న సమాచారం కోదాడ పోలీసులకు అందింది. వెంటనే పట్టణంలోని వెంకటేశ్వర నగర్ లో ఓ ఇంటిపై దాడి చేసి రూ.3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను సీజ్ చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకేజింగ్ చేసి, అమాయక వినియోగ దారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also read
- దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఆ ఇంట
- రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్ చెక్ చేయగా..
- అర్జెంట్‌గా డబ్బు అవసరమని ఫోన్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి.. కొన్న కాసేపటికే
- కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!
- నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ





