SGSTV NEWS online
Spiritual

ఆత్మ నరకలోక ప్రయాణం – సౌమ్యపురానికి చేరుకునే మార్గంలో అనుభవించే కఠినమైన శిక్షలేంటో తెలుసా..?

గరుడపురాణం  ప్రకారం, ఆత్మ తన ప్రయాణంలో చేరుకునే మొట్టమొదటి పట్టణం సౌమ్యపురం. 13వ రోజున ప్రయాణం మొదలుపెట్టిన ఆత్మ, సుమారు 18 రోజుల కఠిన ప్రయాణం తర్వాత (అంటే మరణించిన నెల రోజుల తర్వాత) ఈ పట్టణానికి చేరుకుంటుందట. యమ మార్గంలో ప్రయాణించే ఆత్మ పడే కష్టాలు మరియు సౌమ్యపురంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి గరుడపురాణంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

యమ మార్గంలో ఆత్మ ఎదుర్కొనే కష్టాలు:

మరణించిన తర్వాత ఆత్మ (ప్రేతాత్మ) యమదూతల చేత పాశబద్ధుడై నిరంతరం ప్రయాణించాల్సి ఉంటుందట. ఈ ప్రయాణంలో ఆత్మ అతి భయంకరమైన జుగుప్సాకరమైన శిక్షలను అనుభవిస్తుందట.

తీవ్రమైన ఆకలి దప్పులు: యమపురి వైపు ప్రయాణం

మొదలు పెట్టిన ఆత్మకు తీవ్రమైన ఆకలి దప్పులు వేస్తాయట. యమదూతలు కనికరం లేకుండా ఆత్మను అలాగే శిక్షిస్తూ.. తీసుకెళ్తుంటారట. దాహం వేస్తుందని ప్రాదేయపడినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలని చుక్క నీరు కూడా ఆత్మకు ఇవ్వరట. అయితే భూలోకంలో ఆత్మ సంబంధీకులు పెట్టే పిండం మాత్రమే ఆత్మకు శక్తినిస్తుందట.

ప్రకృతి వైపరీత్యాలు: ఇక దారి పొడవునా ఎండల వేడి,

ముళ్ల బాటలు, అగ్ని వర్షాలు, భయంకరమైన గాలి వానలు వంటివి ఆత్మను హింసిస్తాయట. రక్త మాంసాలతో నిండిన అతి భయంకరమైన వైతరిణి నది దాటడం ఆత్మకు అతిపెద్ద సవాలట.

సౌమ్యపురంలో ఆత్మ అనుభవించే కష్టాలు:

ఆత్మ తన ప్రయాణంలో వైతరణి నది దాటి యమపురి మార్గంలో వచ్చే మొదటి పట్టణం సౌమ్యపురం చేరుకున్న తర్వాత తీవ్రమైన శిక్షలు అనుభవిస్తుందట. సౌమ్యపురానికి చేరుకోగానే ఆత్మకు తన సంసారం, బంధువులు మరియు తాను చేసిన తప్పులు గుర్తుకు వచ్చి తీవ్రమైన దుఃఖానికి, తీవ్రమైన ఆవేదనకు లోనవుతుందట. ఇక్కడ ఆత్మను యమదూతలు కాలపాశాలతో కట్టి, ముళ్లతో కొడుతూ ముందుకు నడిపిస్తారట. అయితే బంధువులు పెట్టే మాసిక పిండాలను తిన్న తర్వాతే ఆత్మకు తదుపరి ప్రయాణానికి శక్తి లభిస్తుందట. ఒకవేళ బంధువులు సరిగ్గా కర్మలు చేయకపోతే, ఆత్మ అక్కడ విపరీతమైన ఆకలితో అలమటిస్తుందట. ఇక సౌమ్యపురంలో ఆత్మకు తన పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది. తాను చేసిన పాపాలను తలచుకుని “అయ్యో! అనవసరంగా పాపాలు చేసి ఈ నరక యాతన అనుభవిస్తున్నానా?” అని పశ్చాత్తాపంతో రోదిస్తూ.. కుమిలిపోతుందట.

గరుడ పురాణం ప్రకారం, సౌమ్యపురం అనేది ఆత్మ తన అంతిమ విచారణ (యమధర్మరాజు ముందు) వైపు సాగే ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ శారీరక హింస కంటే మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుందని చెప్పబడింది.

పుష్పభద్ర నది: సౌమ్యపురం సమీపంలోనే పుష్పభద్ర

అనే నది ప్రవహిస్తుందట. ఇక్కడ ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఆత్మ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందట. అయితే, అక్కడ ఉండే యమధర్మరాజు దూతలు (యమ కింకరులు) ఆత్మను విశ్రాంతి తీసుకోనివ్వకుండా, భూలోకంలో చేసిన పాప పుణ్యాలను గుర్తు చేస్తూ తదుపరి ప్రయాణానికి పురికొల్పుతారట.

సౌమ్యపురం నుంచి ఆత్మ తదుపరి ప్రయాణం:

సౌమ్యపురంలో ఈ అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత, ఆత్మ తన తదుపరి గమ్యమైన సౌరిపురం వైపు ప్రయాణించాల్సి ఉంటుందట. ఈ మార్గంలో క్రమంగా ఆత్మ తన భౌతిక ప్రపంచపు జ్ఞాపకాలను వదులుకుంటూ, కేవలం కర్మ ఫలాలను అనుభవించే దిశగా వెళ్తుందట.


గమనిక : ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో రెండవ పట్టణమైన సౌరిపురానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు   తరువాత ఏపిసోడ్ లో తెలుసుకుందాం.

సేకరణ :భాను ప్రకాష్

Related posts