SGSTV NEWS online
Andhra PradeshCrime

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎన్ఎంసీకి విద్యార్థి ఫిర్యాదు




కర్నూలులోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యార్థులు సేవాభావంతో ఉండాల్సిన వాతావరణంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఓ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు.


కర్నూలు, ఏప్రిల్ : కర్నూలు మెడికల్ కాలేజీ (KMC)లో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగ విప్పింది. జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి వేధించిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలు ఏం జరిగిందంటే..?

కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ (MBBS) మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని, అదే కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వేధింపులకు గురిచేశాడు. సదరు సీనియర్ విద్యార్థి జూనియర్ వద్దకు వెళ్లి గోడ కుర్చీ వేయ్ అంటూ హుకుం జారీ చేశాడు. దీనిని నిరసించిన జూనియర్ విద్యార్థిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

జాతీయ వైద్య కమిషన్ (NMC)కి ఫిర్యాదు..

కళాశాల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడం లేదా భయంతో సదరు బాధిత విద్యార్థి నేరుగా నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. ర్యాగింగ్‌పై కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎంసీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.

యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ..

ఎన్ఎంసీ నుంచి ఆదేశాలు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజీ యాజమాన్యం తక్షణమే స్పందించింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. బాధిత విద్యార్థి, నిందితుడిగా భావిస్తున్న సీనియర్ విద్యార్థి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. ప్రాథమిక విచారణలో ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది.

పోలీసులకు సమాచారం..

ఈ ఘటనపై కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ మాట్లాడారు. ర్యాగింగ్ ఫిర్యాదు అందిన వెంటనే అంతర్గత విచారణ చేపట్టామని తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని కర్నూల్ మూడో టౌన్ పోలీసులకు కూడా నివేదించినట్లు ఆమె స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యా బుద్ధులు నేర్చుకుని సమాజానికి సేవ చేయాల్సిన వైద్య విద్యార్థులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం దురదృష్టకరమని తల్లిదండ్రులు చెబుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ యాజమాన్యం తీసుకునే కఠిన చర్యలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకుంటాయని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

Also read

Related posts