SGSTV NEWS online
CrimeTelangana

అమ్మాయిలకు జిహాదీ ట్రైనింగే టార్గెట్.. టెర్రర్ లింక్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు..!





విజయవాడ టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించే బాధ్యతను సైదా బేగం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని రిక్రూట్ చేయాలని ఉగ్రవాద సంస్థలు ఆమెకు టాస్క్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 42 మంది అమ్మాయిలను ఆమె తన నెట్‌వర్క్‌లోకి తీసుకువచ్చినట్లు సమాచారం.

రిక్రూట్ చేసిన మహిళలకు స్నిప్పర్ రైఫిల్ వినియోగం, షూటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలనే సూచనలు కూడా సైదాకు అందినట్లు విచారణలో వెల్లడైంది. “Khawateen” పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తూ మహిళలను ఒక్కచోట చేర్చి, వారిలో తీవ్రవాద భావజాలాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. యువతను మతపరంగా ఆకర్షించి నెట్‌వర్క్‌ను విస్తరించాలని జిహాదీ గ్రూపులు ఆమెకు నిరంతరం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.



ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వీడియోలను షేర్ చేస్తూ యువతలో తీవ్రవాద భావజాలాన్ని నింపేందుకు సైదా ప్రయత్నించినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 40 అకౌంట్లు తెరిచి జిహాదీ ప్రచారం కొనసాగించినట్టు గుర్తించారు. మదర్సాల్లో మతపరమైన శిక్షణ పూర్తయ్యాక ఆయుధాల వినియోగంపై ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించినట్టు విచారణలో తేలింది. సైదా ఉపయోగించిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి పెద్ద ఎత్తున PDF ఫైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బ్లాక్ పౌడర్ తయారీ, పేలుడు పదార్థాల నిర్మాణం వంటి ప్రమాదకర అంశాలపై వీడియోలు, డాక్యుమెంట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని లింకులు బయటపడే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు.

Also read

Related posts