SGSTV NEWS online
CrimeNational

కన్నతల్లి దారుణం- కొడుకు ఆరోగ్యం కోసం కూతురు నరబలి- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు


మానత్వానికే మచ్చు తెచ్చే ఘటన- కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందని కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి- ఘటనపై దర్యాప్తు చేపట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Human Sacrifice In Jharkhand: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే ఆ బాలిక పాలిట యమపాశమైంది. కొడుకు ఆరోగ్యం బాగుపడాలని కన్న కూతుర్నే నరబలి ఇచ్చింది. ఈ దారుణం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే?
కుసుంబా గ్రామానికి రష్మీ దేవి అనే మహిళ కొడుకు సుధీర్ కుమార్ సింగ్ గతేడాదిగా శారీరక, మానసిక అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో రష్మీ పలుమార్లు గ్రామంలోని శాంతి దేవి (మంత్రగత్తె)ను పలుమార్లు సంప్రదించింది. ఈ క్రమంలో సుధీర్ ఆరోగ్యం శాశ్వతంగా బాగుపడాలంటే ఒక కన్య బాలికను బలి ఇవ్వాలని రష్మీకి శాంతి సూచించింది. రష్మీ చిన్న కూతురిలో దైవశక్తి కొలువై ఉందని, ఆమెను బలి ఇవ్వడం అత్యంత శుభప్రదమైన కార్యమని శాంతి నమ్మపలికింది. ఈ మాటలు విన్న రష్మీ తన కుమార్తెను అష్టమినాడు నరబలి ఇచ్చేందుకు సిద్ధమైంది.

మాన్సా ఆలయంలో తాంత్రిక పూజలు
మార్చి 24న రాత్రి 9.30 గంటల సమయంలో రష్మీ, స్థానికుడు భీమ్రామ్‌తో కలిసి తన చిన్న కుమార్తెను శాంతి ఇంటికి తీసుకెళ్లింది. శాంతి ఇంటి ఆవరణలో ఉన్న మన్సా దేవాలయం లోపల పూజ ప్రారంభమైంది. సంప్రదాయ తాంత్రిక ఆచారాలు ప్రకారం ఆ బాలికను అక్కడ కూర్చోబెట్టారు. ఆ బాలికకు కుంకుమ, కాటుక దిద్దారు. అలాగే ప్రసాదాన్ని అందించారు. ఆ తర్వాత నేలమీద పడుకోమని బాలికను కోరారు. ఆ తర్వాత మంత్రగత్తె ఆదేశాల మేరకు బాలికను భీమ్రామ్ గొంతు నులిమి చంపేశాడు. ఆ బాలిక మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత మంత్రగత్తె తన మంత్రదండం పట్టుకుని మృతదేహం చుట్టూ తిరిగింది.

బాలిక తల పగలకొట్టిన నిందితులు
ఆపై మంత్రాలు జపిస్తూనే మంత్రగత్తె చిన్నారి మృతదేహంపై అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడింది. అనంతరం మంత్రగత్తె ఆదేశాల మేరకు భీమ్రామ్ బాలిక తలపై ఒక రాయి వేశాడు. ఆ దెబ్బకు బాలిక తల పగిలింది. ఆమె ముఖమంతా రక్తంతో తడిసి ముద్దయ్యింది. ఆ క్షుద్ర పూజా క్రతువులో భాగంగా ఆ బాలిక ముఖంపై ఉన్న రక్తాన్ని ఆమె శరీరంపై పూశారు. అలాగే కొన్ని రక్తపు బొట్టులను మన్సా ఆలయం లోపల చిలకరించారు.

కేసును ఛేదించిన పోలీసులు
ఈ మిస్టరీ కేసును ఝార్ఖండ్ పోలీసులు తాజాగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్టు చేశారు. వీరిలో మరణించిన బాలిక తల్లి రష్మీ దేవి, స్థానికుడు భీమ్రామ్, మంత్రగత్తె శాంతి దేవి ఉన్నారు. అంతకుముందు ఈ కేసును ఛేదించేందుకు ఐపీఎస్ అధికారి నాగరగోజే శుభమ్ భావుసాహెబ్ ఆధ్వర్యంలో ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు ఝార్ఖండ్ డీజీపీ.

భీమ్రామ్ , రష్మీ దేవి మధ్య గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని హజారీబాగ్ ఎస్పీ అంజన్ వెల్లడించారు. రేష్మీ పిల్లలు భీమ్ రామ్‌ను తండ్రి స్థానంలో చూడటం అలవాటు చేసుకున్నారని పేర్కొన్నారు. తత్ఫలితంగా భీమ్రామ్ రష్మీ కుటుంబంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించేవాడని స్పష్టం చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బాలికపై ఎటువంటి అత్యాచారం జరగలేదని వివరించారు. అలాగే బాలిక నాలుకను గానీ, కళ్లను గానీ పీకివేయలేదని చెప్పారు. ఈ కేసులో నిందితులకు వీలైనంత త్వరగా కఠిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు.

పరిహారం నిలిపివేత
ఈ హత్యలో బాధితురాలి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నందున, వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని నిలిపివేసినట్లు హజారీబాగ్ డిప్యూటీ కమిషనర్ శశి ప్రకాశ్ సింగ్ తెలిపారు. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని వెల్లడించారు.

జాతీయ మహిళా కమిషన్ సీరియస్
మరోవైపు, హజారీబాగ్ జిల్లాలో 12 ఏళ్ల మైనర్ హత్యపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.
మార్చి 25న అనుమానాస్పదస్థితిలో మైనర్ మృతదేహం లభ్యమైందని, ఆమె శరీరంపై దారుణమైన గాయాల గుర్తులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన సమాజాన్ని కుదిపేసిందని, మహిళలు, బాలికల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 10 రోజుల్లోగా ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. బుధవారం నాడు ఏర్పాటైన ఈ కమిటీ ఏప్రిల్ 2న ఘటనాస్థలిని పరిశీలించనుంది

Also read

Related posts