మూసాపేట, చెన్నారావుపేట : రెండో పెళ్లి చేసుకున్న భర్త పెట్టే బాధలు భరించలేకపోయిందో.. కన్నబిడ్డలకూ కష్టాలు తప్పవని భావించిందో.. ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరేసి.. తానూ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ కూకట్పల్లి ఠాణా పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెంలోని బోడమాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్, పదహార్ చింతల్ తండాకు చెందిన స్రవంతి(30)ని గతంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు హైదరాబాద్ మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్(12), కౌశిక్(10). ప్రవీణ్ భవన నిర్మాణ రంగంతోపాటు కారు డ్రైవర్గానూ పనిచేస్తున్నాడు. స్రవంతి ఇళ్లలో పనిచేస్తుండేది.
ఏడాది క్రితం ఆమెకు సోదరి వరసయ్యే మహేశ్వరి ఎలియాస్ సోనీని ప్రవీణ్ రెండో వివాహం చేసుకుని వేరేచోట ఉంచాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై తీవ్రమయ్యాయి. అతను నిత్యం మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. చాలాసార్లు చెయ్యి చేసుకోవడంతో స్థానికులు సర్దిచెప్పారు. ఈ క్రమంలో ఆదివారం నర్సంపేటలో స్రవంతి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. ఇకనుంచి బాగా చూసుకుంటానని ప్రవీణ్ చెప్పడంతో దంపతులు సోమవారం రాత్రి రాఘవేంద్ర సొసైటీలోని ఇంటికి తిరిగివచ్చారు. ప్రవీణ్ మంగళవారం ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. తలుపులకు గడియపెట్టి ఉండగా.. ఎంత పిలిచినా భార్య బదులివ్వలేదు. స్థానికుల సాయంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా.. అప్పటికే స్రవంతితోపాటు కార్తిక్, కౌశిక్ లు ఇంటి పైకప్పునకు వేలాడుతూ కనిపించారు.
దీంతో వారి మృతికి ప్రవీణే కారణమంటూ వరంగల్ జిల్లా బోడమాణిక్యం తండాలోని అతని ఇంటిపై స్రవంతి బంధువులు దాడిచేసి నిప్పంటించారు. వారిని ప్రవీణే హత్యచేశాడని ఆరోపించారు. కార్తిక్ కొంపల్లిలోని ఓ వసతిగృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు మూసాపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో స్రవంతిని భర్త ఇష్టమొచ్చినట్లు కొట్టాడని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. దీంతో మానసికంగా కుంగిపోయిన స్రవంతి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం కార్తిక్ తన మేనమామ సెల్ఫోన్కు ‘నాన్న.. రాత్రి అమ్మను కొట్టి… తాతమ్మతో సెల్ఫోన్లో మాట్లాడాడు’ అని వాట్సప్లో మెసేజ్ పంపించాడు. ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ జోన్ ఏసీపీ నరేష్, కూకట్పల్లి సీఐ కె.వెంకటసుబ్బారావు పరిశీలించారు.
Also read
- తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..
- కనిపెంచిన తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని మీరూ కొడుకులేనా.? వీరు ఏం చేశారో తెలిస్తే..!
- అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!
- ఏ కాలంలో ఉన్నాం మనం ఇంకా.. ఎటు పోతుంది సమాజం.. తాగుడు కోసం ఇంత దారుణమా?
- ఆస్తి వివాదం – వ్యక్తిపై యాసిడ్ దాడి – పరిస్థితి విషమం




