ఫిట్స్‌తో బైక్ వద్ద విలవిలలాడుతున్న యువకుడిని కాపాడేందుకు అయ్యో.! పాపం అని వెళ్ళిన కౌలు రైతు జేబు నుంచి 67 వేలు చోరీ చేశారు నలుగురు యువకులు. ఆ తర్వాత బైకులపై పరారయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కలకలం రేపుతుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన రామాల నాగేశ్వరావు అనే కౌలు రైతుకు వ్యవసాయమే జీవనం. గత కొంతకాలంగా వరి పంట దిగుబడి లేక ఆ కౌలు రైతుకు అప్పులు పెరిగాయి. తన కూతురు బంగారం ఇచ్చి బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తీర్చి వ్యవసాయం మానేయాలని సూచించింది. కూతురు ఇచ్చిన బంగారం తీసుకుని తండ్రి, తల్లి ఇద్దరు TVS మోపెడ్ బండిపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఉన్న DCCB బ్యాంక్‌కు వెళ్లారు. బంగారం తాకట్టు పెట్టి రూ. 67 వేలు తన చొక్కా జేబులో పెట్టుకుని బ్యాంక్ బయటకు వచ్చాడు. అప్పటికే బ్యాంకు ముందు నలుగురు యువకులు రెక్కీ వేసి ఉన్నారు.
బ్యాంకులో నుంచి బయటకు వచ్చిన కౌలు రైతును గమనించి ముందుగా ఒక యువకుడు బైకుపై వచ్చి ఫిట్స్ వచ్చినట్లుగా.. బైకుపై నుంచి పడిపోయినట్లు నటిస్తాడు. అదే సమయంలో మరో యువకుడు వస్తూ అయ్యో.! రక్షించండి.. రక్షించండి.. ఫిట్స్ వచ్చాయి. కొంచెం లేపండంటూ యువకుడు అరుస్తాడు. అక్కడే ఉన్న కౌలు రైతు నాగేశ్వరరావు అయ్యో.. పాపం అంటూ కింద పడబోతున్న యువకుడిని పైకి లేపే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో వేరొక బైకుపై మరో ఇద్దరు యువకులు ఎదురుగా బైకును పెట్టి సహాయం చేస్తున్నట్టు నటించి కౌలు రైతు జేబు నుంచి రూ. 67 వేల నగదును చోరీ చేసి రెండు బైకులపై పరారయ్యారు.
తన జేబులో ఉన్న డబ్బులు దొంగిలించి పారిపోతున్నారని గ్రహించి కౌలు రైతు కేకలు వేసాడు. అప్పటికే ఆ యువకులు స్పోర్ట్స్ బైకులు కావడంతో క్షణాల్లో వేగంగా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వ్యవసాయం చేసి అప్పులపాలైన కౌలు రైతు ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోయాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రెండు నెలలుగా తనకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నాడు. సత్తుపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే పట్టపగలు సినీ ఫక్కీలో యువకులు చోరీ చేయడంతో స్థానికుల్లో కలకలం రేపుతుంది. కాగా, ఈ ఘటన జనవరి 23న పట్టపగలు జరగ్గా.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం.. ఏపీలో ఎక్కడ ఉందంటే..
- ఫిట్స్ వచ్చిన బైకర్‌కు సాయం చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే..
- ఎంతకు తెగించార్రా.. తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. కారణం తెలిస్తే..
- ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..





