నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ విద్యార్థిని తేజస్విని మృతి వివాదం మరో మలుపు తిరిగింది. తేజస్విని మృతికి దీర్ఘ కాలిక వ్యాదే కారణమంటూ యాజమాన్యం ప్రకటించగా అసలు అలాంటి వ్యాది తమ కూతురుకు లేనే లేదంటూ తేజస్విని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తమ కూతురిని యాజమాన్యమే పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
జ్వరంతో బాధపడుతున్న తమ కూతురికి సరైన సమయంలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఎక్కడ బయటపడుతుందో అని ఆగమేఘాల మీద లుకిమియా అనే క్యాన్సర్ వ్యాధితోనే తేజస్విని చనిపోయిందంటూ ప్రకటించడం దారుణమన్నారు. కనీసం నివాళులు అర్పించేందుకు కూడా క్యాంపస్‌లోకి అనుమతించలేదని.. తమ కూతురు వస్తువులను తీసుకెళ్లేందుకు కూడా యూనివర్సిటీ లోకి రానివ్వకుండా గేటు ముందే ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు మృతికి న్యాయం కావాలని.. తమ కూతురుకు జరిగిన అన్యాయం ట్రిపుల్ ఐటీలో ఏ కూతురుకు రావద్దంటూ బోరున విలపించారు. తేజస్విని మృతిపై న్యాయ విచారణ జరపాలంటూ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.
మరో వైపు తేజస్విని మృతికి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఘనంగా నివాలులర్పించారు తోటి విద్యార్థులు. తేజస్విని తల్లిదండ్రులకు క్యాంపస్‌లోకి ఎంట్రీ లభించకపోవడంతో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుండి ప్రధానగేటు వరకు క్యాండిల్ ర్యాలీ తీశారు విద్యార్థులు. తేజస్విని తల్లిదండ్రులు గేటు బయటే ఉండిపోగా.. వారి ఆవేదన పంచుకుంటూ గేటు లోపలే తేజస్విని చిత్రపటానికి నివాళులర్పించింది విద్యార్థి లోకం.
తేజస్విని మరణానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని , యూనివర్సిటీ అధికారులను కోరారు ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘం టీఎస్ఏఎస్. తేజస్విని కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభ విద్యార్థుల ఐక్యతను, బాధను, న్యాయం కోసం తేజస్విని కుటుంబానికి కట్టుబడి ఉందని తెలిపింది తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ.
మరో వైపు యాజమాన్యం మాత్రం తేజస్విని మృతికి నివాళులు కూడా అర్పించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తేజస్విని తల్లిదండ్రులు క్యాంపస్‌కు వస్తున్నారని తెలిసి ఆగమేఘాల మీద తేజస్విని మృతికి క్యాన్సర్ వ్యాదే కారణం అంటూ ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది యాజమాన్యం. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పి.యు.సి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లెపూడు తేజస్విని మరణానికి గల కారణాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నివేదికలు ధ్రువీకరించాయని.. తాజాగా అందిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం, తేజస్విని అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్ (బ్లడ్ క్యాన్సర్ – 4వ స్టేజి) తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.
గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న తేజస్వినికి ఆర్జీయూకేటీ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని.. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారని రాసుకొచ్చారు. దురదృష్టవశాత్తూ, అప్పటికే క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అయితే తేజస్విని మృతిపై వైద్యులు ఇచ్చిన నివేదికను మాత్రం ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఎక్కడ పొందుపరచలేదు.దీంతో ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ నివురుగప్పిన నిప్పులానే కొనసాగుతోంది.
Also read
- మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు చెప్పేది ఏమిటి!
- నేటి జాతకములు…22 మార్చి, 2026
- Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో సంచలన ట్విస్ట్! వెలుగులోకి..
- Andhra News: ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి చూడగా
- పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!





