SGSTV NEWS online
Astro TipsSpiritual

గణపతి పూజతో సమస్త గ్రహ దోష నివారణ- బుధవారం రోజు ఆచరించాల్సిన నియమాలివే!

గణపతి పూజతో గ్రహ దోష నివారణ రహస్యమిదే- శని, రాహు, కేతు దోషాలు ఒకేసారి పోవాలంటే ఇదే మార్గం!


Ganesha Remedies For Graha Dosha : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాధారణంగా ఏదైనా గ్రహ దోషం ఉన్నప్పుడు నవగ్రహాలకు పూజలు జరిపించుకోవాలని, శాంతి పూజలు చేయించాలని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా శని దోషం వంటివి ఉన్నప్పుడు శనీశ్వరునికి తైలాభిషేకం జరిపించడం, దానాలు ఇవ్వడం వంటివి చూస్తుంటాం. అయితే నవగ్రహాల్లో ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఉన్నా ఒక్క వినాయకుని వివిధ రూపాలను పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయని తెలుస్తోంది. బుధవారం రోజు మాత్రమే ఆచరించాల్సిన ఈ దోష నివారణ పూజకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గణపతి పూజతో గ్రహ దోష నివారణ
నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉన్నా బుధవారం గణపతిని ప్రత్యేక రీతిలో ఆరాధించడం వల్ల సత్వరమే గ్రహ దోష నివారణ లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇక్కడ ఒక్కో గ్రహ దోషానికి ఒక్కో విధమైన వినాయకుని పూజించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

సూర్య గ్రహ దోష నివారణకు

సూర్య గ్రహ దోష నివారణకు బుధవారం రోజు ఎర్రచందనంతో చేసిన గణపతిని కుంకుమ కలిపిన నీటితో అభిషేకించాలి. అనంతరం ఎర్ర చందనం, ఎర్రని పూలతో గణపతిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని వినాయకునికి నివేదించాలి. ఇలా 7 బుధవారాలు చేయడం వలన సూర్య గ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

చంద్ర గ్రహ దోష నివారణకు

చంద్ర గ్రహ దోష నివారణకు బుధవారం రోజు వెండి లేదా పాలరాయితో చేసిన వినాయకుడిని ఆవుపాలతో అభిషేకించాలి. తెల్లని పూలతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అనంతరం కొబ్బరికాయ, పాయసం, దధ్యోదనం వినాయకుని నివేదించాలి. ఇలా 5 బుధవారాల్లో చేయడం వలన చంద్ర గ్రహ దోష బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కుజ గ్రహ దోష నివారణకు

కుజ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు రాగితో కానీ, ఎర్ర చందనం చెక్కతో చేసిన, పగడపు శిలతో కానీ తయారు చేసిన వినాయకుని దానిమ్మ పండ్ల రసంతో అభిషేకించాలి. ఎర్రని పూలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. దానిమ్మ పళ్లు, బెల్లం అన్నం వినాయకునికి నివేదించాలి. ఇలా 9 బుధవారాల్లో పూజించడం వలన కుజ దోష సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

బుధ గ్రహ దోష నివారణకు

బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు మరకతం అంటే పచ్చరాయితో తయారు చేసిన వినాయకుని కొబ్బరినీళ్లతో అభిషేకించాలి. గరికతో, బిల్వ పత్రాలతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. చిత్రాన్నం, అరటిపండ్లు వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 5 బుధవారాలు పూజిస్తే బుధ గ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

గురు గ్రహ దోష నివారణకు

గురు గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పసుపుతో కానీ, చందనం లేదా బంగారంతో తయారు చేసిన గణపతిని పసుపు నీళ్లతో అభిషేకించాలి. పసుపు రంగు చేమంతులు, పసుపు కలిపిన అక్షింతలతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. నిమ్మకాయ పులిహోర, మామిడి పండ్లు వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 బుధవారాలు పూజిస్తే గురు గ్రహ దోష సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

శుక్ర గ్రహ దోష నివారణకు

శుక్ర గ్రహ దోష నివారణకు బుధవారం రోజు స్ఫటిక గణపతిని కుంకుమ పువ్వు కలిపిన పచ్చి పాలతో అభిషేకించాలి. గులాబీలు, మల్లెలు, జాజులతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. క్షీరాన్నం, ఉండ్రాళ్లు వినాయకునికి నివేదించాలి. ఇలా 5 బుధవారాలు చేయడం వలన శుక్ర గ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

శని గ్రహ దోష నివారణకు

శని గ్రహ దోష నివారణకు బుధవారం రోజు నల్లరాయిపై చెక్కిన గణపతిని నల్ల ద్రాక్ష రసంతో అభిషేకించాలి. నీలం శంఖు పూలు, జిల్లేడు పూలతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. బెల్లం, నువ్వుల ఉండలు వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 బుధవారాలు చేయడం వలన శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది.

రాహు గ్రహ దోషానికి

ఇక రాహు గ్రహ దోషం పోవడానికి బుధవారం రోజు మట్టితో చేసిన గణపతిని పంచామృతాలతో అభిషేకించాలి. నాగమల్లి పూలతో, అక్షింతలతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. మినప గారెలు, రాగులతో తయారు చేసిన లడ్డులు వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 7 బుధవారాలు వినాయకుని పూజిస్తే రాహు గ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

కేతు గ్రహ దోష నివారణకు

కేతు గ్రహ దోష నివారణకు బుధవారం రోజు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని చెరకు రసంతో అభిషేకించాలి. మరువం, దవనం, గరికతో వినాయకుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. కుడుములు, మోదకాలు వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 బుధవారాలు పూజించడం వలన కేతు గ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా ప్రత్యేకమే!
నవగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి మాత్రమే కాకుండా మరికొన్ని సమస్యలకు కూడా బుధవారం ప్రత్యేక గణపతి రూపాలను పూజిస్తే సమస్యలు తొలగుతాయి. ముఖ్యంగా ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు. పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృత్తిలో తరచుగా ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. ఇక స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.
ప్రతి బుధవారం ఈ విధంగా వినాయకుని వివిధ రూపాలు పూజించడం వలన సమస్త గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని గణేశ పురాణంలో వివరించి ఉంది.

మనం కూడా గణపతి వివిధ రూపాలను పూజిద్దాం. గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందుదాం. జై గణేష్!




Related posts