SGSTV NEWS online
Andhra PradeshCrime

పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల ఘర్షణ.. చివరకు ఓ ప్రాణమే పోయింది..



తండ్రికి పెన్షన్ డబ్బులు వచ్చాయి.. కొడుకు తన అవసరాలకు రెండు వేలు కావాలని అడిగాడు.. కుదరదని తండ్రి చెప్పడంతో కొడుకు ఒప్పుకోలేదు.. వేరే చోట అప్పు తీసుకునే సమయం లేదు.. కావాలంటే మళ్లీ ఇస్తానని చెప్పాడు. అయినా తండ్రి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు.. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. అది కాస్త ఘర్షణకు దారితీసింది.. చివరకు ఊహించని విషాదానికి కారణమైంది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో పింఛన్ డబ్బుల కోసం జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. మద్యం మత్తులో ఉన్న కొడుకును తండ్రి కర్రతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బట్టేపాడు గ్రామానికి చెందిన మాముడూరు పుల్లయ్యకు సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పించన్ డబ్బులు వచ్చాయి. విషయం తెలుసుకున్న అతని కొడుకు మస్తానయ్య, పించన్ డబ్బులు తనకు ఇవ్వాలని తండ్రిని డిమాండ్ చేశాడు. తండ్రి పుల్లయ్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ మొదలైంది.

అప్పటికే తండ్రీకొడుకులిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కోపం పట్టలేని మస్తానయ్య తండ్రిపై చేయి చేసుకున్నాడు. దీనికి ఆగ్రహించిన తండ్రి పుల్లయ్య పక్కనే ఉన్న కర్రను తీసుకొని కొడుకు మస్తానయ్య తలపై బలంగా మోదాడు. ఈ దెబ్బతో కొడుకు మస్తానయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మస్తానయ్యకు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పించన్ డబ్బుల కోసం జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Also Read

Related posts