SGSTV NEWS online
Andhra PradeshCrime

Ichchapuram: రజస్వల అయిన బాలిక.. 2 ఏళ్లుగా ఇంట్లోనే చీకటి గదిలో.. అధికారులు వెళ్లి చూడగా..



శ్రీకాకుళం ఇచ్చాపురం చక్రపాణి వీధిలో ఆశ్చర్యం కలిగించే ఘటన వెలుగుచూసింది. రజస్వలైన కూతురు బయటికి వెళ్తే ప్రమాదమని భయంతో వితంతువైన భాగ్యలక్ష్మి ఇంటికే పరిమితం చేసింది. స్కూల్‌ మాన్పించి, ఇంటికి విద్యుత్ నిలిపివేసి, బయటికి వెళ్తే తాళం వేసి వెళ్లేదట. ..

చీకటి గదిలో రెండేళ్లగా మగ్గుతున్న ఓ బాలికకు ఎట్టకేలకు విముక్తి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో చక్రపాణి వీధిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. 2022లో రజస్వల అయిన తన కుమార్తెను బయటికి పంపడం మంచిది కాదన్న భయంతో ఓ తల్లి ఇంట్లోనే ఉంచుతోంది. 2 ఏళ్లగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చక్రపాణి వీధిలో వితంతువు ఊళ భాగ్యలక్ష్మి తన అన్న ఇంట్లో కుమార్తె మౌనికతో కలసి ఉంటుంది. ఒరిస్సాలోని కటక్‌కి చెందిన నరసింహరాజుతో 2007 లో భాగ్యలక్ష్మికి వివాహం అయింది. డెలివరికీ కన్నవారింటికి వచ్చిన భయాలక్ష్మికి మౌనిక పుట్టింది. అలా పుట్టింటికి వచ్చిన ఆమె ఇచ్చాపురంలోనే ఉండిపోయింది. తర్వాత భర్త చనిపోయాడు. కుమార్తెను ఇచ్ఛాపురంలోని స్థానిక ప్రయివేటు స్కుల్లో చదివిస్తూ వచ్చింది. 2022లో మౌనిక 9వ తరగతి చదువుతున్న సమయంలో రజస్వల అయింది. అంతే… అప్పటి నుంచి తల్లి కుమార్తెను బయటకు విడిచిపెట్టకుండా ఇంట్లోనే ఉంచుతూ.. కుమార్తెకు కావలసిన ఆహార పదార్ధాలను సమకూర్చుతోంది. రజస్వల అయిన నువ్వు బయటకు వెళితే ప్రమాదం అని బాలికకు తల్లి భయం నూరిపోసింది. స్కూల్ మాన్పించింది. ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి కూతురుతో కలిసి ఇంట్లో చీకటిలోనే ఉంటూ వచ్చింది. ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే కుమార్తెను ఇంట్లోనే ఉంచి బయట నుంచి ఇంటికి తాళం వేసి వెళ్లేది భాగ్యలక్ష్మి.

బాలిక అటు స్కూల్‌కి వెళ్ళక, ఇటు బయటకు రాకపోవడంతో స్థానికులు పలుమార్లు తల్లి భాగ్యలక్ష్మిని నిలదీసిన సంఘటనలు ఉన్నాయి. అడిగిన వారందరినీ తిట్టి, శాపనార్ధాలు పెట్టడంతో ఆమె విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇరుగుపొరుగువారు సాహసించేవారు కాదు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానిక అంగన్వాడీ కార్యకర్త.. ఐసిడిఎస్ PO రాజేశ్వరికి సమాచారం ఇచ్చారు. దాంతో ఆమె ఇచ్చాపురం జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి పరేష్ కుమార్ దృష్టికి విషయం తీసుకువెళ్లగా.. తహసీల్దార్ వెంకటరావు, ICDS పీఓ రాజేశ్వరి, సిబ్బంది, MEO అప్పారావు, పోలీసులతో కలిసి ఆమె ఇంటిని మంగళవారం సందర్శించారు. తల్లి నిరాకరించినప్పటికీ బలవంతంగా గదిని తెరిచి బాలికను బయటకు తీసుకువచ్చారు. చీకటిలో సంవత్సరాల తరబడి ఉండటం వల్ల బాలిక నడవలేని స్థితిలో కనిపించడం అందరినీ కలచివేసింది.

గతంలో బాలిక తండ్రి మరణించిడంతో తల్లి మానసిక కుంగిపోయి ఆడపిల్లను బయటకు పంపితే ఏం జరుగుతుందోనని భయంతో ఇలా బంధించిందని స్థానికులు చెబుతున్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్లు అధికారులు గమనించారు. దీంతో బాలికను కోర్టుకు తరలించి జడ్జి స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే సమయంలో ICDS సిబ్బంది తల్లిని చికిత్స కోసం విశాఖకు తరలించారు. బాలికను శ్రీకాకుళం బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు

Also Read

Related posts