ఆ అమ్మాయికి 13 ఏళ్లు.. అతనికేమో 40 ఏళ్లు.. అతనికి ఆ అమ్మాయి.. కుతురులా ఉంటుంది.. ఇద్దరికీ.. ఈడు జోడు అస్సలే కుదరదు.. కానీ.. ఆస్తి కోసం కుదిరించారు.. చివరకు ముక్కుపచ్చలారని ఆ అమ్మాయితో.. అతనికిచ్చి.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేశారు.. సీన్ కట్ చేస్తే.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. బాల్య వివాహాలు నేరమని తెలిసినా.. ఇరు కుటుంబాలు బడికి వెళ్లే అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో.. పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన సంచలనంగా మారింది.
బాల్య వివాహాలు ముక్కుపచ్చలారని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇలాంటి పెళ్లిళ్లు నేరమని.. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చట్టాలు చెబుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉండటం ఆందోళనకరంగా మారింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో.. 13 ఏళ్ల బాలికను.. 40 ఏళ్ల వ్యక్తితో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు రంగంలోకి దిగారు.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తితో పాటు బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు.
40 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తికి అప్పటికే ఒకసారి పెళ్లి అయిందని.. భార్య దూరం కావడంతో ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడని సమాచారం.. ఈ క్రమంలో మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో.. ఎక్కడా సంబంధం దొరకలేదు.
చివరికి తన మేన కోడలయ్యే 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అమ్మాయిని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఈ ప్రతిపాదనను వారికి చెప్పాడు.. దీంతో బాలిక తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.. ఎకరం పొలం, రెండు సొంతిళ్లు ఉండడంతో.. పెళ్లి తర్వాత ఆస్తిపాస్తులన్నీ తమ కుమార్తె సొంతమవుతాయన్న ఆశతో బాలిక తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పెళ్లి పనులు మొదలుపెట్టడంతో.. ఈ విషయం పోలీసుల వరకు చేరింది.. దీంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి.. వారికి వార్నింగ్ ఇచ్చారు.. బాల్య వివాహం నేరమని, అమ్మాయిని బడికి పంపాలని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.
అయితే.. ఏం పట్టనట్లు రెండు కుటుంబాలు మరో ప్లాన్ రచించాయి.. గుట్టుచప్పుడు కాకుండా రెండు కుటుంబాలు వేరే ప్రాంతానికి వెళ్లి 40 ఏళ్ల వ్యక్తికి ఆ అమ్మాయినిచ్చి బాల్య వివాహం చేశాయి. అనంతరం ఏం జరగనట్టు ఇంటికి వచ్చారు.
అప్పటికే.. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు.. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె మెడలో పసుపుతాడు కనిపించింది. ఇది చూసి కంగుతిన్న పోలీసులు.. బాలిక తల్లిదండ్రులు, ఆ వ్యక్తిని పిలిచి హెచ్చరించారు. చిన్నారి మెడలోంచి తాళి తీసి.. బడికి పంపాలని లేకపోతే కేసు పెడతామని తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో భయపడిపోయిన బాలిక తల్లి.. ఆమె మెడలోంచి పసుపుతాడి తీసేసి బడికి పంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
Also Read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




