SGSTV NEWS online
CrimeTelangana

Telangana: కూతుర్ని చూసిన ఆనందంతో హైదరాబాద్ బయల్దేరాడు.. నల్గొండ చేరుకునేలోపే..



తమకు కలిగే సంతానంపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మరి ముఖ్యంగా ఆడపిల్ల పుడితే మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడుతుంటారు. వారి భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటారు. కుమార్తె పుట్టిందనే సంతోషం తీరకుండానే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఏపీలోని బాపట్ల జిల్లా అనుమాలిపేట మండలం వేటపాలెం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాసరావుకు భువనతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు, భార్యతో కలిసి హైదరాబాద్ చందానగర్‌లో ఉంటున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఇటీవలే కొద్ది రోజుల క్రితం శ్రీనివాసరావుకు పాప కూడా జన్మించింది. తన కూతురిని చూసేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన వేటపాలానికి బైక్‌పై వెళ్ళాడు. తన కూతురిని చూసుకుని ఎంతో ముచ్చట పడ్డాడు. తిరిగి బైక్‌పై వేటపాలెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గం మధ్యలో నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలోకి రాగానే ముందుగా వెళ్తున్న బైక్ స్లో కావడంతో శ్రీనివాసరావు తన బైక్‌తో ఢీ కొట్టాడు.


దీంతో అదుపుతప్పి శ్రీనివాసరావు కింద పడిపోయాడు. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న ట్రాక్టర్ అతడి ఛాతిపై వెళ్లడంతో విగతజీవిగా పడి ఉన్నాడు. దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు వెంటనే శ్రీనివాసరావుకు సిపిఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే శ్రీనివాసరావు ప్రాణాలను కోల్పోయాడు. కుమార్తె పుట్టిందనే సంతోషం తీరకుండానే శ్రీనివాసరావు అనంతలోకాలకు వెళ్లాడు. శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ నెల 30వ తేదీన సోదరుడి వివాహం జరగాల్సి ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Also read

Related posts