వరకట్న వేధింపులకు ఓ అబల బలైంది. పెళ్లయి ఏడాది గడవకముందే.. వేధింపులు తట్టుకోలేక అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇక ఈ లోకంలో ఉండలేనంత బాధను అనుభవించి.. ఊపిరి తీసుకుంది. తన జీవితంలో భాగస్వామిగా ఉండాల్సిన వాడే సుఖదుఃఖాల్లోనూ దూరం చేశాడన్న బాధతో తనువు చాలించింది. మృతదేహం పక్కనే తల్లి బిడ్డల ప్రేమ ను ప్రతిబింబించే ఓ చిత్రం.. అందరినీ కంటతడి పెట్టించింది. అయితే.. ఆమెది ఆత్మహత్య కాదు హత్య చేశారన్నది బాధిత కుటుంబం ఆరోపణ.. ఈ విషాద ఘటన విశాఖ గోపాలపట్నం పరిధిలో జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడకు చెందిన వేపాడ దిలీప్ కుమార్.. అచ్యుతాపురానికి చెందిన విజయశ్యామలతో గతేడాది డిసెంబర్ 6న వివాహం జరిగింది. వివాహ సమయంలో భారీగా కట్న కానుకలు సమర్పించారు శ్యామల కుటుంబ సభ్యులు.. శ్యామల కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్టిఎల్ లోని ఉద్యోగి కావడంతో.. ఉద్యోగరీత్యా విశాఖ గోపాలపట్నం పరిధిలోని రామకృష్ణ నగర్ లో నివాసం ఉంటున్నారు. దిలీప్ కుమార్ భార్యతో సక్రమంగా ఉండేవాడు కాదు. కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడు కాదు. డ్యూటీ నుంచి సమయానికి ఇంటికి వచ్చేవాడు కాదని తల్లితో చెప్పి ఆవేదన చెందేది శ్యామల. ఆమె ఎంత బాధ భరించిందో ఏమో కానీ.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్యామల.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్ తో పాటు.. ఆ పక్కనే ఓ చిత్రాన్ని కూడా గుర్తించారు పోలీసులు. అందులో వైట్ పేపర్ పై తల్లి బిడ్డ ఆప్యాయంగా ఉన్నట్టు చిత్రాన్ని చిత్రీకరించి.. దానిపై ‘అమ్మ.. కన్నయ్య..’ అనే పదాలు రాసి ఉన్నాయి. భర్త వేధింపులతో.. తల్లి కాలేకపోతున్నానని ఆవేదనే ఆమెతో అలా రాయించిందా అన్న అనుమానం పోలీసుల్లో వ్యక్తం అవుతుంది.
ఈ లోగా శ్యామల పేరెంట్స్ అక్కడకు చేరుకున్నారు. కూతురు మృతదేహం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అదనపు కట్నం కోసం, ఎకరం స్థలం కోసం తన కూతుర్ని వేధించి పోట్టను పెట్టుకున్నారని ఆవేదన చెందింది ఆ తల్లి. తన కూతురి ముఖంపై గాయాలు ఉన్నాయని.. శ్యామలది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపించారు తల్లి రోజా రమణి. ఎంత పని చేశావు శ్యామల అంటూ నా తల్లి రోదన కంటతడి పెట్టించింది. తల్లి బిడ్డల చిత్రం గీసి..అమ్మ.. కన్నయ్య.. అనే రాసిన పదాలు సోదరుడిని తీవ్రంగా కలిచి వేశాయి. తల్లి కాలేకపోతున్న అన్న బాధ కూడా తన సోదరిలో ఉందేమో అన్న ఆవేదన ఉందేమో అని.. అందుకే ఆ చిత్రాన్ని బహుశా శ్యామల గీసి ఉంటుందని ఆవేదనతో అంటున్నాడు సోదరుడు ప్రసాద్..
పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వీడియోగ్రఫీతో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధిత బంధువులు.
భర్త సహా బాధ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. భర్త దిలీప్ కుమార్ ను అరెస్టు చేశారు పోలీసులు. జీవితం కోసం ఎన్నో కలలు కనింది శ్యామల. కష్టపడి సంపాదించిన ఉద్యోగం, పెళ్లి చేసుకున్న భర్తతో ఇక జీవితాంతం తిరుగులేదని భావించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి ప్రేమ పొందాలని అనుకుంది. కానీ ఆమె కలలో కల్లలుగానే మిగిలిపోయాయి. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇక ఈ జీవితం చాలు అనుకొని… తనువు చాలించిన ఘటన అందరినీ కలిసివేసింది. పక్కనే.. తల్లి బిడ్డల ప్రేమను ప్రతిబింబించే చిత్రం ఆమె మాతృత్వం కోసం పడిన ఆరాటాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ దృశ్యం కుటుంబ సభ్యుల్లో మరింత ఆవేదన నింపింది.
Also Read
- Andhra: ‘అమ్మ.. కన్నయ్య’.. కంటతడి పెట్టిస్తోన్న ఆ చిత్రం.. పాపం ఆమె ఎంత కుమిలిపోయిందో..
- Hyderabad: 45 ఏళ్ల పాత సమాధిలో మరో మృతదేహాన్ని పాతిపెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంట్లోకి వెళ్లిన ఓ యువకుడు.. ఆ తర్వాత, ఏం జరిగిందంటే..
- శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీలో విద్యార్ధి సూసైడ్.. ఏం జరిగిందో?
- విద్యార్థి తో అక్రమ సంబంధం.. ‘అంకుశం’ స్టైల్ నడి రోడ్డుపై నడిపించిన తిరుపతి పోలీసులు





