SGSTV NEWS online
CrimeNational

ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates

ఢిల్లీ, నవంబర్‌ 11: ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది (Delhi Blast). ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు నడుపుతోన్న వ్యక్తి డాక్టర్ ఉమర్‌ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్ర కుట్రల్లో భాగమైన వారిలో ఏకంగా ఐదుగురు వైద్యులు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ ఘటనను మంత్రులు, అధికారులు దీనిని ఉగ్ర ఘటనగా పేర్కొన్నప్పటికీ.. చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద దర్యాప్తు చేస్తున్నారు.

కశ్మీర్‌లో తీగలాగితే.. ఫరీదాబాద్‌లో కదిలిన డొంక
నిషేధిత జైషే మహ్మద్, అన్సార్‌ గజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేసినట్లు సోమవారం జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్‌ షాహిన్‌ సోమవారం లఖ్‌నవూలో అరెస్టు కాగా ఆమె కారు నుంచి ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపారు.

మరోపక్క గుజరాత్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరులను గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం. ఈ పరిణామాల వేళ ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన సహచరుల అరెస్ట్, బాంబు తయారీలో వాడే పేలుడు పదార్థాల స్వాధీనంతో నిరాశ చెందిన అతడు ఈ పేలుడుకు పాల్పడి ఉండొచ్చన్న కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.



భారీ కూంబింగ్‌తో అప్రమత్తమై..!
అదీల్‌.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేశాడు. ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌ ఒకేదగ్గర పనిచేసేవారు. ఆమెది లక్నో. గత మూడు సంవత్సరాలుగా అల్‌ ఫలాహ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ అండ్ రీసెర్చ్‌ సెంటర్‌లో ముజమ్మిల్‌ సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో ఉమర్ కూడా పనిచేస్తున్నాడు. ఫరీదాబాద్‌లో పోలీసులు చేపట్టిన భారీ తనిఖీలు, తన సహచరుడు షకీల్‌ అరెస్ట్‌తో తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు దాదాపు 800 మంది పోలీసులు వచ్చినట్లు సమాచారం. అయితే ఆ భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

మరోవైపు ఉమర్‌ ఎంతకాలంగా అక్కడ పనిచేస్తున్నాడు.. ఇతరులతో అతడికి ఉన్న పరిచయాలపై ఫరీదాబాద్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమర్‌, ముజమ్మిల్‌ కదలికలను తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్‌తో పేలుడుకు పాల్పడేందుకు వారిద్దరూ కలిసి ఢిల్లీలో పర్యటించారా..? లేదా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్ర కుట్ర చేధించిన తర్వాత నుంచి పరారీలో ఉన్న ఉమరే బాంబర్ కావొచ్చని అనుమానిస్తున్నారు. ఇక ఈ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) వెల్లడించారు.

Also read

Related posts