SGSTV NEWS online
Astrology

Budhaditya Yoga: ఆ రాశుల వారికి సమస్యలు, వివాదాల నుంచి విముక్తి! మనశ్శాంతి పక్కా

 


నవంబర్ 16న వృశ్చిక రాశిలో రవి, బుధులు కలిసి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తారు. ఈ విశిష్ట కలయిక దాదాపు నెలరోజుల పాటు వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తిని అందిస్తుంది. వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి, మనశ్శాంతి, ఆర్థిక వృద్ధి, ఉద్యోగంలో పురోగతి లభిస్తాయి.

రవికి ఉచ్ఛ క్షేత్రంతో సమానమైన వృశ్చిక రాశిలో రవి, బుధులు కలవడం విశిష్టత సంతరించుకుంది. మిత్ర క్షేత్రమైన వృశ్చిక రాశిలో గ్రహ రాజు రవికి రెట్టింపు బలం కలుగుతుంది. ఈ నెల(నవంబర్) 16న రవి ఈ రాశిలో ప్రవేశించి బుధుడితో కలిసి సుమారు నెల రోజుల పాటు ఈ బుధాదిత్య యోగాన్ని కలిగిస్తాడు. ఈ బుధాదిత్య యోగం అనుకూలంగా ఉన్న రాశులవారు వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశులవారు తమను చాలా కాలంగా పీడిస్తున్న సమస్యలన్నిటి నుంచి బయటపడి మనశ్శాంతి పొందే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం ఈ రాశివారికి అత్యంత శుభప్రదం. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. చాలా కాలంగా వదలకుండా పీడిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఎవరికీ చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగడంతో పాటు, కొందరు సన్నిహిత మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభించడం ఈ రాశివారికి చెప్పుకోదగ్గ విశేషం.

కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, బుధుల యుతి వల్ల ఈ రాశివారిలో నైపుణ్యాలు, సమర్థత, శక్తి సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలే కాక, ఉద్యోగ, వృత్తి, వ్యాపార సమస్యలకు కూడా ఊహించని పరిష్కారాలు లభిస్తాయి. అనుకోకుండా వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ జీవితం ఎటువంటి సమస్యలూ లేకుండా సాఫీగా, హ్యాపీగా సాగిపోవడం జరుగుతుంది. తెలివితేటలు, సమయస్ఫూర్తి బాగా వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

సింహం: రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో ద్వితీయ, లాభాధిపతి బుధుడితో కలవడం వల్ల నెల రోజుల పాటు సమస్యలే లేని జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం వల్ల పని భారం, పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స లభిస్తుంది. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో అత్యంత శుభప్రదమైన బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక, కుటుంబ సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా మటుమాయం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం తగ్గిపోతాయి. పదోన్నతికి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలున్నా తొలగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి.

వృశ్చికం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఎటువంటి క్లిష్ట సమస్యలున్నా పరిష్కారమై జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం అన్ని విధాలుగానూ పెరిగి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోయి అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు స్తబ్ధత నుంచి బయటపడి లాభాల పరంగా దూసుకుపోతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.

మకరం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి అంచనాలకు మించి లబ్ధి పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యల స్థానంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. దూరమైపోయిన బంధు మిత్రులు దగ్గరవుతారు. ఆదాయ వృద్ధికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Also Read

Related posts