SGSTV NEWS online
Crime

Nandyala: పెళ్లి కాకుండానే పిల్లలు.. విక్రయం!

ఇప్పటికే ఇద్దరిని అమ్మినట్లు సమాచారం మూడో శిశువుకు జన్మనివ్వడంతో వెలుగులోకి..

నందికొట్కూరు, న్యూస్టుడే: పెళ్లి కాకుండానే ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం, ఆమెకు అప్పటికే రెండు ప్రసవాలు చేసినట్లు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బిడ్డలను కని, విక్రయించడమే వారి వ్యాపారమని స్థానికులు అంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలోని హాజీనగర్ కాలనీలో ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. చిన్న కుమార్తెకు వివాహం కాలేదు. ఆమె గురువారం ఇంట్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

శిశువు ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. బాలింత సోదరి నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చింది. వైద్యులు శిశువును హీట్ థెరపీ యూనిట్లో ఉంచారు. అనంతరం బాలింత సోదరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వైద్యులు, సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు శిశువును నంద్యాలలోని కేర్ సెంటరు  తరలించారు. అనంతరం శిశువు తల్లి కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. ఆ మహిళను గుర్తించిన వైద్యులు, సిబ్బంది.. గతంలో ఆమెకు రెండు ప్రసవాలు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో శిశువు తల్లి, కుటుంబసభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు.

ఇదే ఆ కుటుంబం వ్యాపారమా?

గతంలో ఆ మహిళ ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వగా కుటుంబసభ్యులు విక్రయించారని, తాజాగా మూడో బిడ్డకు జన్మనిచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో పిల్లలను కని, విక్రయించడమే ఆ కుటుంబసభ్యుల వ్యాపారంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారని, ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని మహిళ తల్లిదండ్రులు తమతో వాగ్వాదానికి దిగినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. వివాహం అయితేనే వర్తిస్తుందని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.


Also Read

Related posts