SGSTV NEWS online
Andhra PradeshCrime

మందుకు డబ్బు ఇవ్వలేదని భార్యతో గొడవపడి.. చివరకు..



విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై అలిగి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్యతో గొడవపడి పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.


మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై అలిగి, మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన బెల్లాన సతీష్‌, రోళ్లవాక గ్రామానికి చెందిన శాంతిని వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంతకాలం తర్వాత సతీష్‌కు మద్యం అలవాటై, క్రమంగా దానికి బానిసగా మారాడు. పనిపాట లేకుండా నిత్యం మద్యం తాగుతూ, దాని కోసం డబ్బుల కోసం భార్య శాంతిని వేధించేవాడు.


ఆదివారం ఉదయం కూడా సతీష్‌ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో.. ఆమెతో దురుసుగా ప్రవర్తించి, డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశాడు. ఎంత వేధించినా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో.. సతీష్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి, గ్రామానికి సమీపంలోని పొలాల్లో పురుగుమందు సేవించాడు.

ఆసుపత్రికి తరలింపు
పురుగుమందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్న సతీష్‌ను గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సతీష్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సతీష్ భార్య శాంతి బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసైన కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సతీష్ మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Also Read

Related posts