విజయనగరం జిల్లా బుడతనాపల్లి గ్రామంలో నాగులచవితి సందర్భంగా భక్తులకు అసలైన నాగుపాము దర్శనం లభించింది. పుట్టలో పాలు పోస్తుండగా పెద్ద నాగుపాము బుసలు కొట్టుతూ బయటకు వచ్చింది. భక్తులు మొదట భయంతో పరుగులు తీశారు. కొందరు.. దానిని దైవస్వరూపంగా భావించి నమస్కరించారు.
నాగులచవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వచ్చిన భక్తులకు నాగుపాము చుక్కలు చూపించింది. విజయనగరం జిల్లా బుడతనాపల్లి గ్రామంలో నాగుల చవితి పర్వదినాన చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. బుడతనపల్లి నాయుడు చెరువు సమీపంలో నాగేంద్రస్వామి పుట్ట వద్దకు గ్రామస్తులు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వెళ్లి భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటాలా ఈ సారి కూడా మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద ఎత్తున చేరి పుట్టలో పాలు పోసి పూజలు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా ఆ పుట్టలోనుండి ఓ పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది.
పుట్టలో పాలు పోస్తుండగా అనూహ్యంగా పైకి ఎగసిన ఆ నాగుపాము తన పడగను ఎత్తి బుసలు కొట్టడంతో ఆ పామును చూసిన భక్తులు ఒక్కసారిగా భయంతో అరుస్తూ పరుగులు తీశారు. కొందరు భక్తులు మాత్రం దూరంగా జరిగి పామును దైవస్వరూపంగా భావించి చేతులు జోడించి నమస్కరించారు. అలా సుమారు అయిదు నిమిషాల పాటు ఆ ప్రాంతమంతా అలజడిగా మారింది. అనంతరం నాగు పాము కొంతసేపు పుట్ట చుట్టూ తిరిగి, మళ్లీ నెమ్మదిగా తన పుట్టలోకి లోపలికి వెళ్లిపోయింది. అయితే నాగుపాము వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాగుల చవితి రోజు నాగుపాము తమకు దర్శనమిచ్చిందని, ఇదొక శుభసూచకమని నాగేంద్రుడి దర్శనం దొరకడం గ్రామానికి శుభఫలితాల సూచనగా స్థానికులు భావిస్తున్నారు. జరిగిన ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. గ్రామస్తులు మాత్రం నాగేంద్రుడు తమ గ్రామంలో ఉన్నాడని, అందుకే తాము ప్రతి ఏటా ఇక్కడే పుట్టలో పాలు పోస్తున్నామని నాగేంద్రుడు తమను చల్లగా చూస్తూ అంత మంచి చేస్తాడని నమ్మకం తమకు ఉందని అంటున్నారు.
Also read
- Sabarimala Gold Case: శబరిమల గోల్డ్ కేసు దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. బళ్లారిలో పట్టుబడిన బంగారం..
- Telangana: ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
- Telangana: ఫోటో చూసి బుద్దిమంతుడు అనుకునేరు.. చేసేవి పోరంబోకు పనులు.. మ్యాటర్ తెలిస్తే
- Andhra: నాగులచవితి రోజున ఏపీలో అద్భుతం.. ఈ దృశ్యాలు చూస్తే పుణ్యం మీ సొంతం..
- Telangana: పగలు పద్దతిగా కస్టమర్ క్యారెక్టర్.. రాత్రి మంకీ క్యాప్ ధరించి.. అతడు ఏం చేశాడంటే.?





