SGSTV NEWS
Andhra Pradesh

పవన్‌ కల్యాణ్ ఆదేశిస్తే తప్పేంటి? – డీఎస్పీ వివాదంపై హోంమంత్రి అనిత స్పందన


భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం -డీఎస్పీ ప్రవర్తనపై నివేదిక కోరిన పవన్‌ – పవన్‌ ఆదేశాలను సమర్థించిన హోంమంత్రి అనిత

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి నివేదిక కోరారు. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ “డిప్యూటీ సీఎం ఆదేశిస్తే తప్పేంటి?” అంటూ స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ ఆదేశాలు: భీమవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో డీఎస్పీ జయసూర్య ప్రవర్తనపై పలు ఫిర్యాదులు రావడంతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ఆరా తీశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. డీఎస్పీ పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, అలాగే కొంతమంది నేతల పేర్లను రాజకీయంగా వాడుతున్నారనే ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పోలీసు అధికారులెవరూ చట్ట విరుద్ధమైన వ్యవహారాలకు అండగా ఉండకూడదనేది పవన్ ఉద్దేశం.

కూటమి నేతల ఫిర్యాదులు: డీఎస్పీ జయసూర్యపై ఎక్కువగా ఉపముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు పంపించారు. దీంతో పవన్ కల్యాణ్‌ జిల్లా ఎస్పీకి కాల్‌ చేసి, “వాస్తవాలపై పూర్తి నివేదిక పంపండి” అని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడడం, చట్టం అమలు చేయడం పోలీసుల బాధ్యత. సివిల్‌ వివాదాల్లో తలదూర్చడం సరికాదని పవన్ కల్యాణ్‌ హెచ్చరించారు. అదే విధంగా భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రికీ, డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.

హోంమంత్రి స్పందన: ఈ అంశంపై హోంమంత్రి వంగలపూడి అనితను విలేకరులు ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ, “డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు ఇస్తే అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు. “మంత్రుల మధ్య సమన్వయం ఉంటే ఓ వర్గం మీడియాకు బాధ ఎందుకు అవుతోంది?” అని ప్రశ్నించారు. “మాకు లేని ఇబ్బందులు కొంతమంది మీడియా వర్గాలకు ఎందుకు?” అని అనిత నిలదీశారు.

“నేను ఇతర శాఖల అంశాలు నా దృష్టికి వస్తే సంబంధిత మంత్రికి తెలుపుతాను. అలాగే పవన్‌ కల్యాణ్‌ కూడా డీఎస్పీ వ్యవహారాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. అని చెప్పారు. “ప్రభుత్వంలో ప్రతీ శాఖ పరస్పర సహకారంతో పని చేయాలి. మంత్రులు తమ పరిధిలోని సమస్యలను గుర్తించి, తగిన విధంగా సూచనలు ఇవ్వడం తప్పు కాదు. ప్రజల ఫిర్యాదులపై స్పందించడం కూడా ప్రభుత్వ బాధ్యతే” అని అన్నారు.

“మేమంతా సమన్వయంతో పని చేస్తున్నాం. ఒక శాఖలో సమస్య వస్తే మరో శాఖ దృష్టికి తీసుకురావడమే పరిపాలనా వ్యవస్థ. దీనిని రాజకీయం చేయడం సరికాదు” అని మంత్రి అనిత స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ సూచనలు, హోంమంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీశాయి.

Also read

Related posts