SGSTV NEWS
Telangana

Telangana: బతుకుమ్మ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.. ఆస్పత్రికి తీసుకెళ్లగా

 

అత్తగారి ఇంట్లో తొలి బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కలలుకంది ఆ నవ వధువు. అందుకు అనుగుణంగానే ఆడపడుచులు, తోటి కోడళ్లు, కొత్తగా పరిచయమైన స్నేహితులతో కలిసి బతుకమ్మ ఆడిపాడింది. అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తలనొప్పిగా ఉందంటూ గుండెల్లో బరువుగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలింది.


నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన రుషితకు బైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామానికి చెందిన వాటోలి రాజుతో గత మే నెలలో వివాహం జరిగింది. దసరా పండుగ సందర్భంగా తొలి బతుకమ్మ అత్తారింట్లోనే జరుపుకోవాలని భావించింది రిషిత. అందులో భాగంగానే నిన్న సాయంత్రం వానల్ పాడ్ గ్రామంలో అత్తారింటి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. దాదాపు గంటపాటు బతుకమ్మ పండుగలో సంబురంగా ఆడిపాడిన రుషిత తీవ్రమైన తలనొప్పి వస్తుందంటూ ఇంటికి వెళ్లేందుకు సిద్దమైంది. గుండెల్లో బరువుగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఒక్కసారిగా కుప్పకూలింది.



అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు రుషితను‌ స్థానికంగా ఉన్న ఆర్ఎంపి‌ వద్దకు ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన రుషిత పరిస్థితి విషమంగా ఉందని బైంసాకు తరలించాలని సూచించాడు స్థానిక ఆర్ఎంపి. ఆర్ఎంపి సలహాతో బైంసాకు తరలిస్తుండగా మార్గం మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురైంది. బైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇటు అత్తవారి ఇంట.. అటు పుట్టినింట తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి

Also read

Related posts