ఉన్న ఆస్తిని కాజేసి కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీదకు గెంటేసిన కొడుకులను ఎంతో మందిని చూశాం. కానీ కొందరు మాత్రం.. తమ అభ్యున్నతికి కృషి చేసిన తల్లిదండ్రులను మర్చిపోరు. అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రుల వైద్యం కోసం అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు ఓ కుమారుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కొండ భాస్కర్ ఐదేళ్ల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీ పర్పస్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. భాస్కర్ తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యారు. వారి వైద్య ఖర్చుల కోసం 8 లక్షల రూపాయల వరకు భాస్కర్ అప్పులు చేశాడు. గతేడాది భాస్కర్ తల్లిదండ్రులు మృతి చెందారు. వచ్చే జీతం కుటుంబపోషణకే సరిపోవడంతో అప్పులు తీర్చలేక సతమతం అవుతున్నాడు. మరోవైపు అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో చేసేదేం లేక తల్లిదండ్రుల వైద్యం కోసం చేసిన అప్పులను దొంగతనాలు చేసి తీర్చాలని భాస్కర్ పథకం వేశాడు.
గ్రామ పంచాయతీలో పని చేస్తుండటంతో గ్రామస్థుల గురించి పూర్తి సమాచారం అతని వద్ద ఉంది. దీంతో తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసేవాడు. ఒకే ఏడాదిలో పిడమర్తి సుశీల, కృష్ణకుమారి ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు. చివరికి గ్రామపంచాయతీలో పనిచేసే తోటి ఉద్యోగి గుండపల్లి నాగేశ్వరావు ఇంట్లో కూడా భాస్కర్ దొంగతనం చేశాడు. ఇలా మూడు ఇళ్లలో బంగారం, నగదు, వెండి వస్తువులు కాజేశాడు. దొంగిలించిన బంగారు ఆభరణాలను కోదాడలోని గోల్డ్ ఫైనాన్స్‌లో పెట్టి డబ్బులు తెచ్చుకునేవాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. భాస్కర్ చోరీలకు పాల్పడిన క్రమంలో కొన్ని నగలు విక్రయించి డబ్బును వినియోగించుకున్నాడు. ఇంట్లో దాచి ఉంచిన కొన్ని నగలను.. కోదాడ గోల్డ్ ఫైనాన్స్‌లో పెట్టేందుకు వెళ్తుండగా పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.3 వేల నగదు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన తల్లిదండ్రుల వైద్యానికి చేసిన అప్పులను తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు భాస్కర్ నేరాన్ని అంగీకరించాడని కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!