SGSTV NEWS
Andhra PradeshCrime

Ayesha Meera Murder Case: అయేషామీరా హత్య కేసులో వీడని మిస్టరీ.. 18 ఏళ్లుగా దక్కని న్యాయం!



CBI Court Issues Notices to Ayesha Meera parents: 18 ఏళ్లుగా అయేషామీరా హత్య కేసు కోర్టులో నానుతూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో న్యాయం మరింత ఆలస్య మవుతుంది. ఈ కేసును CBIకి అప్పగించినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిలిపోయే పరిస్థితి నెలకొంది..

గుంటూరు, సెప్టెంబర్‌ 13: గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న అయేషామీరా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం నెలకొంది. 2007 డిసెంబర్‌ 27న రాత్రి లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబుకు 2008లో అరెస్ట్‌ చేయగా.. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. అయితే 2017లో హైకోర్టు అతడు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. దీనిపై అయేషామీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసును CBIకి అప్పగించారు. దీనిపై 3 నెలల కిందట సీబీఐ నివేదిక అందించింది. సత్యంబాబుపై పునర్విచారణకు పెట్టిన కేసుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు రావాలని తాజాగా ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషాలకు కోర్టు నోటిసీలు జారీ చేసింది. అయితే ఈ కేసులో సీబీఐ నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని, కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ ఆయేషా తల్లిదండ్రులు మీడియాకు వెల్లడించారు.

‘పోలీసుల మాదిరే సీబీఐ కూడా వ్యవహరిస్తోంది.. సీఎం జోక్యం చేసుకోవాలి’ అయేషా మీరా తల్లి
అయేషా మీరా హత్య కేసులో సిబిఐ హైకోర్ట్ కు ఇచ్చిన రిపోర్టును మాకివ్వాలని తల్లి అయేషా మీరా తల్లి షంషాద్ బేగం మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. మాకు ఆ రిపోర్ట్ కాపి ఇవ్వకుండా అభ్యంతరాలు చెప్పమంటే ఎలా చెప్తామని ప్రశ్నించారు. సిబిఐ విచారణకు రావాలని చెప్పిన వెళ్ళలేదు. సిబిఐ దర్యాప్తు సంస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మా మతాచారాలకు వ్యతిరేకంగా ఖననం చేసిన తర్వాత కూడా మా పాప శరీర భాగాలు తీసుకెళ్ళారు. ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వలేదు. పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా సీబీఐ కూడా చేస్తోంది. నివేదిక మాకు ఇస్తే చదువుకున్న తర్వాతే అభ్యంతరాలు చెబుతాం. ఈ కేసులో 18 ఏళ్లు పోరాటం చేస్తున్నాం. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి. మా పాప విషయంలో న్యాయం జరిగినప్పుడు ఇతరుల విషయంలో కూడా న్యాయం జరుగుతుందని నమ్ముతామని ఆమె ఆన్నారు


Also read

Related posts

Share this