రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ఇద్దరు పిల్లలను చాకచక్యంగా కాపాడిన వెదుళ్ళపల్లి పోలీసులు మూడు ప్రాణాలను రక్షించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి అలర్ట్ కావడంతో వేగంగా స్పందించిన ఎస్సై భాగ్యరాజ్, సంఘటన స్థలానికి చేరుకుని సమయోచిత చర్యలు తీసుకున్నారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్పందించి వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అలెర్ట్ చేశారు. వెదుళ్ళపల్లి ఎస్సై త్వరితగతిన స్పందించి, సిబ్బందిని వెంటపెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకుని, స్టూవర్టుపురం రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ఆమె కుమార్తెలను చాకచక్యంగా కాపాడారు. వారు ఆత్మహత్యకు యత్నించడానికి దారి తీసిన కారణాల గురించి.. అడిగి తెలుసుకున్నారు. కుటుంబ వివాదాల నేపథ్యమే కారణమని తెలుసుకొని, వారి నివాసానికి వెళ్లి కుటుంబ విభేదాలపై కౌన్సిలింగ్ నిర్వహించి, సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసులు వేగంగా స్పందించడం వల్లనే ముగ్గురు ప్రాణాలు నిలిచాయని, క్షేమంగా వారిని తీసుకువచ్చినందుకు వెదుళ్ళపల్లి పోలీసులకు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్‌లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు స్పందించిన తీరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయన్నారు. వాటిని సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకుంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఎలాంటి ఒత్తిడిలోనైనా ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఒక్కసారి మీ కుటుంబం, పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యకు తప్పనిసరిగా పరిష్కార మార్గం ఉంటుందన్నారు. తగిన సలహా, మార్గదర్శనం కోసం మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ “శక్తి బృందాలను”ను ఏర్పాటు చేసిందని, మహిళలపై వేధింపులు, గృహ హింస, కుటుంబ విభేదాల వంటి సమస్యల పరిష్కారానికి మహిళా పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం అందుబాటులో ఉందని, జిల్లా ప్రజలు వీరి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
100 లేదా 112 నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల పోలీస్ అధికారులు వేగంగా స్పందించాలన్నారు. తద్వారా నేరాలను అరికట్టడంతో పాటు, ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడడానికి ఆస్కారం ఉంటుందన్నారు. వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే దానికి నిదర్శనమన్నారు. వెదుళ్ళపల్లి పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు నిండు ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు. పోలీసులు ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలన్నారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. వేగంగా స్పందించి ముగ్గురి నిండు ప్రాణాలను కాపాడిన వేదుళ్లపల్లి ఎస్సై భాగ్యరాజ్ ని వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025