SGSTV NEWS
CrimeTelangana

వరంగల్: ఓరుగల్లులో గజ గజ.. నగరంలో టాటూ గ్యాంగ్ హల్‌చల్.. ప్రజలకు బిగ్ అలర్ట్..

తెలంగాణా…ఇప్పటివరకు చెడ్డి గ్యాంగ్.. పార్ధు గ్యాంగ్ లాంటి కరడు గట్టిన దొంగల ముఠాలను చూశాం.. కానీ ఇప్పుడు మరో డేంజర్ ముఠా దోపిడీలకు రంగంలోకి దిగింది.. అదే “టాటూ గ్యాంగ్”.. భారీ దోపిడీలకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఈ ముఠా వరంగల్ ను టార్గెట్ చేసింది.. విశాలంగా ఉంటే ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి లూటీలకు బరితెగిస్తోంది.. తాజాగా హనుమకొండ PS పరిధిలోని ఓ ఇంట్లో భారీదోపిడీకి ప్రయత్నం చేశారు.. అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షేక్ అయిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు..


హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురిలో జరిగిన రాబరీ నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది..సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఈ దోపిడికి పాల్పడిన ముఠా మామూలు దొంగలు కాదని కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని గుర్తించారు.. మొత్తం ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి దోపిడీలకు పాల్పడ్డారు.. వాళ్ళ ఒంటిపై ప్రతిఒక్కరి ఎడమ చేతిపై పచ్చబొట్టు, చేతిలో మారణాయుధాలు కలిగి ఉండడం చూసి ఇదేదో డిఫరెంట్ డేంజర్ గ్యాంగ్‌గా భావిస్తున్నారు.

విద్యారణ్యపురిలో దోపిడీకి పాల్పడిన ఈ ముఠా ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసంచేసి ఇంట్లోకి ప్రవేశించారు.. విలువైన వస్తువులు దొంగిలించారు.. సీసీ కెమెరాల్లో వాళ్ల దోపిడి దృశ్యాలు అంతా రికార్డయ్యాయి. అర్థరాత్రి దోపిడికి పాల్పడిన ముఠా రెండున్నర గంటలపాటు ఆ ఇంట్లోనే గడిపినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్‌లో లభ్యమైన ఆధారాలను బట్టి పోలీసులు గుర్తించారు.. ఈ ముఠా ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంట్లోని వారు గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరు నిద్రలేచి ప్రతిఘటించకపోవడంతో అంతా ప్రాణాలతో బయటపడ్డారు.. లేకపోతే ఊహించిన విధంగా ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు పేర్కొంటున్నారు.


ఈ దోపిడీ ఘటన జరిగి 24 గంటల వ్యవధిలో వాళ్ళు ఇంకా సిటీ దాటి వెళ్ళలేదని పోలీసు నిఘా వర్గాలు, ccs టీమ్స్ గుర్తించాయి.. ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ముఠా వరంగల్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో తలదాచుకున్నారని.. కచ్చితంగా ఏదో ఒక దారుణానికి పాల్పడతారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందుగా అప్రమత్తమైన పోలీసులు.. నగర పరిసరాలన్నీ జల్లెడ పడుతున్నారు.. టాటూ దొంగల గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. ఈ దొంగల గురించి ఏమైనా సమాచారం ఉంటే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు

Also read

Related posts

Share this