March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు.. విజయసాయి వస్తారా రారా?



మాజీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందాయి. విచారణకు రావాలంటూ సీఐడీ పిలిచింది. ఆయనను బుధవారం(మార్చి 12) సీఐడీ ఆఫీసులో విచారణ చేయనుంది. అయితే విజయసాయి వస్తారా రారా? ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి? అన్నదీ ఆసక్తికరంగా మారింది.


మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 12 అంటే.. బుధవారం విచారణకు రావాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. తన నుంచి అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటల కల్లా మంగళగిరి సీఐడీ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు.


కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితోపాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి, ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఈడీ ఎదుట విచారణకు సైతం సాయిరెడ్డి హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు. మాజీ ఎంపీ సాయిరెడ్డికి సీఐడీ ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్‌ రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే సీఐడీ ఎలాంటి ప్రశ్నలు వేస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈడీ ఎదుట ఆయన హాజరైన నేపథ్యంలో సీఐడీ ఎలాంటి విచారణ చేపడుతుందనేది చూడాలి. అయితే వైసీపీ నుంచి ఇప్పటికే వైదొలిగారు విజయసాయిరెడ్డి. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి.. రాజకీయ సన్యాసంలో ఉన్నారు. ఇప్పుడు కేసులు కోర్టులు అంటూ ఆయన తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విజయసాయిరెడ్డి ఇప్పటివరకు ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్లలేదు. అయితే ఆయన ముందస్తు బెయిల్‌ దాఖలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది


Also read

Related posts

Share via