February 23, 2025
SGSTV NEWS
Crime

ఇదేం ఘోరం.. తండ్రిని వెంటాడి వేటాడి పిడిగుద్దులతో గుద్ది చంపిన కొడుకు



సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు సూరిబాబు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత వచ్చిన రిపోర్టులు ప్రకారం గుండె పై బలంగా పలు మార్లు గుద్దడం వల్లే సూరిబాబు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు.. అనే పాట ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటే నిజమనిపిస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రిని కంటికి రెప్పలా చూసుకోవలసిన కొడుకే ఆస్తి కోసం వెంటాడి, వేధించి పిడిగుద్దులతో గుద్ది చంపాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని గాజులరేగలో చోటు చేసుకుంది.

కరణపు సూరిబాబు, తన భార్య బంగారులక్ష్మీలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సూరిబాబుకు భార్యతో పాటు ఒక్క కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గత కొన్నాళ్ల క్రితం సూరిబాబుతో గొడవపడిన బంగారులక్ష్మీ కుమారుడు సాయి, కుమార్తె గౌరీని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కుమారుడు సాయి తన తల్లి వద్ద నుండి తిరిగి తండ్రి సూరిబాబు వద్దకు వచ్చేశాడు. అలా వచ్చిన సాయి గాజులరేగలోనే తండ్రితో కలిసి నివసిస్తున్నాడు.

తండ్రి కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటే, కొడుకు సాయి మాత్రం చదువుసంధ్యలు లేకుండా మద్యం, గంజాయికి అలవాటు పడి జులాయిగా మారాడు. ఈ క్రమంలోనే స్నేహితుల దగ్గర, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి, పూర్తిగా ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల ఒత్తిడి పెరగడంతో పాటు చేతులో డబ్బులు లేకపోవడంతో తాము నివాసం ఉంటున్న ఇంటిని అమ్మి తనకు డబ్బులు ఇవ్వమని తండ్రిని అడిగాడు. అయితే ఉన్న ఇల్లు కూడా అమ్మితే తలదాచుకోవడానికి ఉండటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని, ఇల్లు అమ్మే వ్యవహారం వదిలేయాలని నచ్చచెప్తూ వచ్చాడు తండ్రి సూరిబాబు.

అయితే ఎలాగైనా సరే ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి, మిగతా డబ్బుతో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు కొడుకు సాయి. ఈ క్రమంలోనే తండ్రితో నిత్యం గొడవ పడుతున్నాడు. అయినా కొడుకు ఒత్తిడికి లొంగకుండా ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదు సూరిబాబు. దీంతో తండ్రికి ఎంత చెప్పినా వినడం లేదని, ఎలాగైనా తండ్రి అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు సాయి. అలా పట్టపగలే పూటుగా మద్యం సేవించి తండ్రి ఇంట్లో ఉన్న సమయంలోనే ఇంటికి వచ్చి మరోసారి ఇంటిని అమ్మాలని తండ్రితో గొడవ పడ్డాడు. అందుకు తండ్రి ససేమిరా అనడంతో పట్టరాని కోపంతో కొడుకు సాయి తండ్రి పై దాడికి దిగాడు.

కొడుకు దాడి చేస్తుంటే తండ్రి సూరిబాబు తనని వదిలేయాలని రోదిస్తూ అతని నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయినా సాయి మాత్రం తండ్రి రోదనలు పట్టించుకోకుండా వెంటాడి సూరబాబును పట్టుకుని గుండెల పై బలంగా పిడుగులు గుద్ది హతమార్చాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడని అందరిని నమ్మించాడు. అయితే విషయం బయటపడి సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు సూరిబాబు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత వచ్చిన రిపోర్టులు ప్రకారం గుండె పై బలంగా పలు మార్లు గుద్దడం వల్లే సూరిబాబు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వెంటనే కొడుకు సాయిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ చేయగా, తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు సాయి. దీంతో సాయిని కటకటాలకు పంపించారు పోలీసులు. సూరిబాబు మరణవార్త విన్న సూరిబాబు భార్య, కుమార్తె కన్నీరుమున్నీరు అయ్యారు

Also read

Related posts

Share via