February 23, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

Drawing: భార్యను చంపిన భర్త… పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!


ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఓ కసాయి భర్త కట్టుకున్న తన భార్యను కడతేర్చాడు. చివరికి ఆ దంపతుల నాలుగేళ్ల కుమార్తె గీసిన డ్రాయింగ్ నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఇంతకీ ఏం జరిగిందో ఈ ఆర్టికల్ లో చదవండి.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో దారుణం జరిగింది.  ఓ కసాయి భర్త కట్టుకున్న తన భార్యను కడతేర్చాడు.
చివరికి ఆ దంపతుల నాలుగేళ్ల కుమార్తె గీసిన డ్రాయింగ్ (Drawing) నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..  ఉత్తరప్రదేశ్ లోని సిటీ కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివ్ పరివార్ కాలనీలో నివసించే 27 ఏళ్ల సోనాలి బుధౌలియా అనుమానాస్పద స్థితిలో మరణించింది. సోనాలి భర్త సందీప్ బుధౌలియా దీనిని ఆత్మహత్యగా చిత్రకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అతని 4 సంవత్సరాల కుమార్తె దృష్టి తన తల్లి హత్య రహస్యాన్ని డ్రాయింగ్ ద్వారా వెల్లడించింది. 




కాగితంపై బొమ్మ వేసి
ఆ అమ్మాయి ఒక సాధారణ కాగితంపై ఒక చిత్రాన్ని గీసి, తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరించింది. తన తండ్రి తన తల్లిని చంపి ఉరివేశాడని కాగితంపై బొమ్మ వేసి మరి చూపించింది. ఇదంతా తాను కళ్లతో చూశానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనాలి భర్త సందీప్ బుధౌలియాను అరెస్ట్ చేశారు. కాగా సోనాలి మృతదేహానికి తన కూతురు అంత్యక్రియలు నిర్వహించింది.  అయితే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దీని కారణంగా సోనాలి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని నిందితుడు విచారణలో వెల్లడించాడు.




సోనాలి తండ్రి తిలక్ మాట్లాడుతూ..  తన కూతురికి 2019 సంవత్సరంలో వివాహం చేశానని చెప్పాడు. పెళ్లిలో రూ. 20 లక్షల కట్నంతో పాటు ఉంగరం, గొలుసు కూడా ఇచ్చానని..  కానీ సోనాలి అత్తమామలు పెళ్లి సమయంలోనే  కారు కూడా కావాలని వివాదం సృష్టించారని వెల్లడించాడు. దీన్నే దృష్టిలో పెట్టుకుని సోనాలిని కావాలని తరచుగా కొట్టి హింసించేవాడని వాపోయాడు. దీని గురించి తాము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని..  దాదాపు రెండేళ్ల పాటు కేసు నడిచిందన్నారు. సోనాలి ఒక కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు కూడా కనీసం చూడటానికి కూడా రాలేదని..  తాము నర్సింగ్ హోమ్ ఛార్జీలు చెల్లించి ఆమెను తమ ఇంటికి తీసుకువెళ్ళామని తెలిపాడు. 


ఇటీవల సోనాలి ఝాన్సీలోని సమతార్‌లో తన బంధువు వివాహానికి హాజరవుతుండగా, సందీప్ ఫోన్ చేసి ఇంటికి తిరిగి రమ్మని కోరాడని తిలక్ చెప్పారు. ఈ రోజు ఉదయం తన కుమార్తె ఆరోగ్యం క్షీణించిందని ముందుగా కాల్ వచ్చిందని..  కొంత సమయం తర్వాత, ఆమె ఉరి వేసుకుందని మరో కాల్ వచ్చిందని తెలిపాడు. తాను అక్కడికి చేరుకోగానే, ఆమె చనిపోయిందని వార్త తనకు తెలిసిందన్నారు..

Also read

Related posts

Share via