February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

5 కేజీల బంగారం నగలు బ్యాగులో పెట్టుకుని స్కూటీపై బయలుదేరాడు.. కొంత దూరం వెళ్లాక

 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు కేజీల బంగారు ఆభరణాలు. అవును.. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాల చోరీ మంగళగిరిలో కలకలం రేపుతోంది. రాత్రి పది గంటల సమయంలో చోరి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆభరణాలు దొంగతనం చేశారా లేక ఉద్దేశపూర్వకంగా దాచేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


మంగళగిరికి చెందిన దివి రాము, దివి నాగరాజు బంధువులు. వీరిద్దరూ విజయవాడలోని ఒక జ్యూవెలరీ షాపులో పనిచేస్తున్నారు. బంగారు షాపు మేనేజర్‌గా రాము పనిచేస్తుండగా…. నాగరాజు ఆభరణాల డెలివరీ బాయ్‌గా పనిలో కుదిరాడు. బంగారు కొట్టులో తయారయిన ఆభరణాలను వివిధ ప్రాంతాలకు వెళ్లి ఇచ్చి రావడం నాగరాజు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి విజయవాడలోని షాపు నుండి ఐదు కేజీల బంగారు ఆభరణాలను బ్యాగ్‌లో పెట్టుకొని బ్యాగ్ స్కూటీపై మంగళగిరిలోని తన ఇంటికి తీసుకొస్తున్నాడు. వాటిని ఆదివారం కోదాడలో డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఆత్మకూరు అండర్ పాస్ వద్దకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు.. బైక్ ఆపి తన నగలున్న బ్యాగ్ ఎత్తుకెళ్లినట్లు నాగరాజు యజమానికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత తన బంధువు, షాపు మేనేజర్ అయిన రాముకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అండర్ పాస్ వద్ద అందరిని విచారించారు. ఆధారాలు సేకరించారు. సిసి కెమెరా పుటేజ్ తీసుకున్నారు. అయితే అక్కడ ఏవి అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించలేదు. దీంతో రాము, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు…

రాము, నాగరాజులు చెబుతున్న మాటలను పోలీసులు విశ్వసించడం లేదు. దీంతో బంగారు ఆభరణాలు చోరిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వీరిద్దరి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. నిజంగా దొంగతనం జరిగిందా లేక చోరి జరిగినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరి జరిగినట్లు అనవాళ్లు లేకపోవడంతో పోలీసులు వీరిద్దరిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐదు కేజీల బంగారు ఆభరణాలు ఎక్కడున్నాయో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దీంతో వీరిద్దరితో పాటు అనుమానం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. సాయంత్రానికి చోరిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు

Also read

Related posts

Share via